Sanna Marin Party Video: ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్న సందర్భంలో కేరింతలు, జోరుగా నృత్యాలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి ప్రతిపక్షాలు.. ఆమె డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చని ఆరోపిస్తున్నాయి. దీంతో స్పందించిన ప్రధాని.. తాను ఎటువంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. కేవలం మిత్రులతో ప్రైవేట్ పార్టీ సందర్భంగా ఆనందంతో నృత్యాలు చేసినట్టు వివరణ ఇచ్చారు.
ప్రధానమంత్రి సనా మారిన్‌తో సహా ఆరుగురు మహిళలు డ్యాన్స్‌లు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో నేలపై మోకాళ్లపై కూర్చొని సనా మారిన్ ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించారు. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేతలు.. ఆమె డ్రగ్స్ తీసుకున్నారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమెకు డ్రగ్ టెస్టు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా తనపై వచ్చిన ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చారు. ఆ వీడియో లీక్ కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదన్నారు.