రుచికరమైన ఆహారాన్ని అమితంగా ఇష్టపడే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. తాజాగా తిండిపై శ్రద్ధ పెట్టారట. అంతేకాదు, వ్యాయామం కూడా చేయడానికి ఇష్టపడని ఆయన.. తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్లే ఇటీవల తొమ్మిది కిలోల బరువు తగ్గారట. ఇదే విషయాన్ని స్వయంగా వెల్లడించిన ప్రపంచ కుబేరుడు.. తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు.
ఉపవాసం చేసి మరీ బరువు తగ్గిన ఎలాన్ మస్క్, అందుకేనా - బరువు తగ్గిన ప్రపంచ కుబేరుడు
రుచికరమైన ఆహారాన్ని ఇష్టంగా తినే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా తిండి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. అసలు వ్యాయామమే ఇష్టపడని ఆయన కసరత్తులు చేసి మరీ బరువు తగ్గారు. ఈ విషయాలను ఆయనే స్వయంగా వెల్లడించారు.
'వాస్తవానికి వ్యాయామం చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ, చేయాల్సి వస్తోంది. మంచి ఆకృతి రావడానికి వర్కవుట్ చేస్తున్నాను. వీటితోపాటు ఓ స్నేహితుడి సలహా మేరకు అప్పుడప్పుడూ ఉపవాసం పాటిస్తున్నాను. తద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉన్నా' అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు సూచనలిచ్చే ఓ యాప్‌ను ప్రశంసించిన మస్క్.. అది కూడా తనకెంతో దోహదపడిందన్నారు. ఇలా చేస్తూ ఎన్ని కిలోల బరువు తగ్గారు అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 9కిలోలకు పైగా తగ్గినట్లు చెప్పుకొచ్చారు.
ఆహారం విషయంలో ఎలాన్ మస్క్ సరైన నియమాలు పాటించరని ఆయన తండ్రి ఎరాల్ మస్క్ ఇటీవలే వెల్లడించారు. అంతేకాదు, బరువు తగ్గేందుకు ఔషధాలు వాడవచ్చు కదా! అని సూచించారు. దీంతో నాన్న చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకున్న మస్క్.. బరువు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, అందుకు ఔషధాలు కాకుండా ఉపవాసం పాటించే పద్ధతిని ఎంచుకున్నట్టు మస్క్ తాజాగా వెల్లడించారు.