ఎలాన్ మస్క్.. వివాదాలు.. ఈ రెండింటికీ ఏదో విడదీయరాని బంధం ఉన్నట్లుంది. సంచలన ప్రకటనలు చేస్తూ.. వివాదాల్లోనూ నిలిచే టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ మస్క్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. బిలియనీర్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షానహాన్‌తో మస్క్ వివాహేతర సంబంధం నడిపిస్తున్నారట. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ కూడా ఓ కథనం ప్రచురించింది.
చాలా ఏళ్లుగా మస్క్, బ్రిన్ మంచి స్నేహితులుగా ఉన్నారు. అయితే తన భార్య నికోల్తో మస్క్‌కు అఫైర్ ఉందని తెలుసుకున్నప్పటి నుంచి బ్రిన్- మస్క్ స్నేహబంధం చెడిందని వార్తలు వస్తున్నాయి.
బ్రిన్ ఈ ఏడాది జనవరిలో నికోల్ షానహాన్‌తో విడాకులకు దరఖాస్తు చేశారు. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని దరఖాస్తులో పేర్కొన్నారు. 2021, డిసెంబర్ 15 నుంచి వేరుగానే ఉంటున్నట్లు చెప్పిన బ్రిన్.. తన కుమార్తె బాధ్యతలను ఇద్దరం చూసుకుంటామని చెప్పారు. నికోల్ నుంచి తనకు ఎలాంటి మద్దతు అవసరం లేదని తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభంలోనే బ్రిన్ను ఓ పార్టీలో కలిసిన మస్క్.. క్షమాపణలు కోరినట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. టెస్లా కార్లను తొలుత పొందిన వ్యక్తుల జాబితాలోనూ బ్రిన్ ఉన్నట్లు సమాచారం. ఇంకా.. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో టెస్లా సంస్థకు బ్రిన్ 5 లక్షల యూఎస్ డాలర్ల సాయం అందించి ఆదుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
నికోల్తో సంబంధం ఉందని వస్తున్న వార్తలపై మస్క్ స్పందించారు. ఇదంతా అర్థరహితమని పేర్కొన్న ఆయన.. బ్రిన్, తాను మంచి స్నేహితులం అని చెప్పారు. గతరాత్రి కూడా పార్టీలో కలిసినట్లు ట్వీట్ చేశారు. నికోల్‌ను గడిచిన మూడేళ్లలో రెండు సార్లు మాత్రమే చూశానని, అప్పుడు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారని అన్నారు. ఇద్దరి మధ్య రొమాంటిక్‌గా ఏం జరగలేదని బదులిచ్చారు.