Eiffel Tower Bomb Threat :ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌ను కూల్చివేసేందుకు బాంబు అమర్చామంటూ కొందరు దుండగులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా సందర్శకులందర్నీ అక్కడి నుంచి బయటకి పంపేశారు. పర్యటకులకు అనుమతి నిలిపివేసినట్లు ఫ్రెంచ్ మీడియా తెలిపింది. పోలీసులు సహా బాంబు నిర్వీర్య బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ టవర్‌ను 1887 జనవరిలో మొదలుపెట్టి.. 1889 మార్చి 31వ తేదీనాటికి నిర్మాణం పూర్తి చేశారు. ప్రారంభ ఏడాదిలో 20 లక్షల మంది సందర్శకులు ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. అయితే ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది పర్యటకులు వస్తుంటారు. గతేడాది 62 లక్షల మంది ఈ కట్టడాన్ని సందర్శించినట్లు రికార్డులు చెబుతున్నాయి.