Earth Quake In China : చైనాలో భారీ భూకంపం సంభవించింది. సిచువాన్ ప్రావిన్సులోని లూడింగ్కు సుమారు 39 కిలోమీటర్ల పరిధిలో ఈ భూకంప కేంద్రం ఏర్పడింది. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు 46 మంది మరణించారని చైనా అధికార పత్రిక పేర్కొంది. భూకంపం సంభవించిన ప్రాంతానికి సుమారు 226 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిచువాన్ ప్రావిన్సు రాజధాని చెంగ్డులోనూ భూమి కంపించింది. దీని తీవ్రత 6.8గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చైనా భూకంప నెట్వర్క్ కేంద్రం తెలిపింది. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. టిబెట్‌ను ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి భూకంపాలు సంభవిస్తాయని అక్కడి ప్రజలు తెలిపారు.
ఇక్కడే యురేసిన్, ఇండియన్ టెక్టానిక్ పలకలు కలుసుకుంటాయి. అప్పుడప్పుడు చాలా బలంగా ఢీకొంటాయి. అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయి. ఇదే ప్రావిన్సులో 2008లో కూడా 8.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆ విపత్తులో 69 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో 7 తీవ్రతతో భూకంపం వచ్చి 200 మందిని బలితీసుకుంది.
అయితే ఈ ప్రాంతం, ఇప్పటికే పెరుగుతున్న కొవిడ్ కేసుల వల్ల సతమతమవుతోంది. కేసులు అదుపులోకి తీసుకురావడానికి వరుసగా లాక్ డౌన్లు విధిస్తున్నారు. దీంతో పాటు వర్షాలు లేక తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది.
అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. ఆరుగురు మృతి
అఫ్గానిస్థాన్‌లో కొన్ని ప్రానిన్సుల్లో భూకంపం సంభవించింది. కునార్ ప్రావిన్సులోని నూర్గుల్ జిల్లాలో దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. కునార్‌తో పాటు మరికొన్ని ప్రావిన్సుల్లో భూమి కంపించినట్లు సమాచారం. చాలా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు.