Donald Trump on India Tax Issue : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు. భారత్‌లో పన్ను రేట్లు అధికంగా ఉన్నాయంటూ మరోసారి ధ్వజమెత్తారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందంటూ ఆరోపించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి తాను అధికారాలు చేపడితే అదే స్థాయిలో తాను భారతీయ వస్తువులపై పన్నులు విధిస్తానని హెచ్చరించారు.
Donald Trump Warning India : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. ముందుగా రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. సర్వేల ప్రకారం చూస్తే.. రిపబ్లికన్ మద్దతుదారుల్లో 50 శాతానికి పైగా ట్రంప్‌కే అండగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలు చెబుతున్న ట్రంప్.. తాజాగా ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా పన్ను విధానాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ విధిస్తున్న పన్నులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Harley Davidson Tax in India :
"పన్నులు సమానంగా ఉండాలని నేను అనుకుంటున్నా. ఉదాహరణకు.. భారత్‌లో పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి. హార్లీ డేవిడ్సన్ బైక్‌ల విషయంలో ఇది నాకు స్పష్టంగా అర్థమైంది. ఈ బైక్‌లపై భారత్ 100 నుంచి 200 శాతం పన్ను విధిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ వర్గాలే చెప్పాయి. తమ వ్యాపారం అంత బాగోలేదని చెప్పాయి. కానీ, ఇండియన్ మోటార్‌బైక్‌లు మాత్రం మన దేశంలోకి ఎలాంటి సుంకాలు లేకుండానే ప్రవేశిస్తున్నాయి. హార్లీ కంపెనీ ఇండియాలో బిజినెస్ చేసుకోలేకపోతోంది. ఎక్కువ పన్నుల వల్ల ఎవరూ ఆ బైక్‌లు కొనేందుకు ముందుకు రావడం లేదు. కానీ నేను అధ్యక్షుడినయ్యాక కఠినంగా వ్యవహరించా. భారత్ పంపే వస్తువులపైనా పన్నులు పెంచుదామని ప్రతిపాదించా. భారత్ 200 శాతం పన్నులు విధిస్తే.. మనం మాత్రం ఎలాంటి సుంకాలు వసూలు చేయడం లేదు. 100 శాతం పన్ను వేద్దామా అని అప్పటి పెన్సిల్వేనియా గవర్నర్‌ను అడిగా. కానీ దీనికి ఆయన అంగీకరించలేదు. కనీసం 25 శాతం, 10 శాతమైనా వేయొచ్చు కదా అన్నా.. ఒప్పుకోలేదు. స్వేచ్ఛా వాణిజ్యం ఇలా ఉండదని బదులిచ్చారు. అసలేంటిది? ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది. భారత్ మనపై అధిక సుంకాలు విధిస్తే.. మేమూ విధిస్తాం. దీన్ని నేను ప్రాయశ్చిత్తం/శిక్ష అని పిలుస్తా. మీరు ఎలాగైనా పిలుచుకోండి."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు