Danish Siddiqui Pulitzer prize: తాలిబన్ల కిరాతకానికి బలైపోయిన భారతీయ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీని ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం వరించింది. ఫీచర్ ఫొటోగ్రఫీ కేటగిరీలో సిద్ధిఖీతో పాటు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీలో పనిచేసే మరో ముగ్గురు భారతీయులను(అద్నాన్ అబిది, సన్నా ఇర్షాద్ మట్టూ, అమిత్ దేవ్) ఈ అవార్డుకు ఎంపిక చేసింది పులిట్జర్ బోర్డ్. భారత్‌లో కరోనా విలయాన్ని కళ్లకుగట్టేలా ఫొటోలు తీసినందుకు వీరికి ఈ పురస్కారం ఇస్తున్నట్లు పేర్కొంది.
తాలిబన్ల కిరాతకానికి బలైన భారతీయ ఫొటో జర్నలిస్టుకు 'పులిట్జర్' - pulitzer prize 2022 winner indian
పాత్రికేయ రంగంలో అత్యున్నత పురస్కారమైన 'పులిట్జర్'.. ఈ ఏడాది నలుగురు భారతీయుల్ని వరించింది. గతేడాది తాలిబన్లకు, అఫ్గాన్ భద్రతా బలగాలకు మధ్య పోరును చిత్రీకరించేందుకు వెళ్లి, ప్రాణాలు కోల్పోయిన ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ వీరిలో ఒకరు. సిద్ధిఖీని పులిట్జర్ వరించడం ఇది రెండోసారి.
డానిష్ సిద్ధిఖీని పులిట్జర్ పురస్కారం వరించడం ఇది రెండోసారి. 2018లో రోహింగ్యాల సంక్షోభాన్ని కవర్ చేసినందుకు పులిట్జర్ అవార్డు దక్కించుకున్న రాయిటర్స్ బృందంలో సిద్ధిఖీ ఒకరు. 2021 జులైలో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న పోరును కవర్ చేసే క్రమంలో సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. అయితే.. సిద్దీఖి మరణం.. ఆకస్మికంగా జరిగింది కాదని అమెరికా పత్రిక ఒకటి తర్వాత కథనం ప్రచురించింది. సిద్దీఖిని తాలిబన్లు బంధించాక.. చిత్రవధ చేశారని చెప్పింది. తలచుట్టూ తీవ్రంగా గాయపరచి, బుల్లెటతో తూట్లు పొడిచి, శరీరాన్ని ముక్కలు చేసి పాశవికంగా చంపారని పేర్కొంది.
వాషింగ్టన్ పోస్ట్‌కు పులిట్జర్: మరోవైపు.. ఇతర విభాగాల్లోనూ పురస్కారాలు ప్రకటించింది పులిట్జర్ బోర్డు. 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్‌పై జరిగిన దాడిని కవర్ చేసినందుకు పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో వాషింగ్టన్ పోస్ట్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కొలంబియా విశ్వవిద్యాలయం.. ఏటా ఈ పురస్కారాలు అందిస్తుంది. విజేతలకు ధ్రువపత్రంతో పాటు 15,000 డాలర్ల నగదు బహుమతి ప్రదానం చేస్తారు.