Kerch Bridge Attack : క్రిమియా ద్వీపకల్పాన్ని.. రష్యా ప్రధాన భూభాగంతో కలిపే కెర్చ్ వంతెనపై మరోసారి దాడి జరిగింది.కాగా.. ఈ వంతెనపై రాకపోకలను రష్యా నిలిపివేసింది. సోమవారం ఉదయం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రష్యా ఆధీనంలోని క్రిమియా రిపబ్లిక్ అధ్యక్షుడు సెర్గీ అక్సోనోవ్ స్పందిస్తూ.. అత్యవసర పరిస్థితి కారణంగా ఈ వంతెనపై రాకపోకలను నిలిపివేశామని చెప్పారు.
తెల్లవారుజామున రెండు పేలుళ్లు..
Kerch Bridge Collapse : సోమవారం తెల్లవారుజామున 3.00-3.30 మధ్యలో కెర్చ్ వంతెనపై రెండు పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో రష్యా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. చాలా మంది వంతెనపై చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. పేలుళ్ల వల్ల కనీసం ఇద్దరు చనిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రష్యా ధ్రువీకరించలేదు. తాజా పేలుళ్ల వల్ల క్రిమియా వంతెనలో కొంత భాగం దెబ్బతిన్నట్లు గ్రేజోన్ అనే వాగ్నర్ అనుకూల టెలిగ్రామ్ ఛానల్ పేర్కొందని సీఎన్‌ఎన్ వెల్లడించింది. రష్యా వైపు నుంచి 145వ పిల్లర్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.