తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్ మూలాల దర్యాప్తులో కదలిక.. ఆ డేటా ఇవ్వాలని కోరిన W.H.O.

కరోనా మహమ్మారి పుట్టుక అంశం మరోసారి తెరపైకి వచ్చింది.కొవిడ్ వైరస్‌ చైనాలోని ప్రయోగశాల నుంచే బయటికి వచ్చిందని మెుదట్నుంచీ ఆరోపిస్తున్న అమెరికా... ఇటీవల మరో నివేదిక వెలువరించింది. అమెరికా నివేదికపై తీవ్రంగా స్పందించిన డ్రాగన్‌ తమకేమీ సంబంధం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొవిడ్ మూలాలపై తెలిసిన సమాచారాన్ని పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు సూచించింది.

Covid origin WHO
Covid origin WHO

By

Published : Mar 4, 2023, 1:13 PM IST

ప్రపంచాన్ని దాదాపు 3ఏళ్లు వణికించిన కరోనా మహమ్మారి గుట్టు ఇప్పటికీ వీడటం లేదు. ఈ కొవిడ్‌ పాపం చైనాదేనని చాలాదేశాలు ఆరోపిస్తున్నా ఆధారాలు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అన్ని దేశాలకు ఒక సూచన చేసింది. కొవిడ్-19 మూలాల గురించి తెలిసిన సమాచారాన్ని తమతో పంచుకోవాలని WHO చీఫ్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ అన్ని దేశాలకూ విజ్ఞప్తి చేశారు. ఈ సమాచారం సేకరించడం ఏ ఒక్కరినో నిందించడానికి కాదని చెప్పారు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ముందస్తుగా ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగానే ఈ సమాచారాన్ని అడుగుతున్నట్లు అథనోమ్‌ స్పష్టం చేశారు. కరోనా వైరస్ మూలాన్ని గుర్తించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ WHO వదిలేయదని స్పష్టం చేశారు.

కరోనా జన్మస్థానం చైనాలోని ఓ ల్యాబ్‌ నుంచే జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. కొత్తగా సేకరించిన నిఘా సమాచారం మేరకు ఈ సంస్థ ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లో అత్యున్నత స్థాయి నిపుణులు ఉండటం వల్ల ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాలో కొన్ని అత్యున్నతస్థాయి జీవ పరిశోధనలు చేసే పరిశోధనశాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. అయితే ఈ నివేదికపై చైనా తీవ్రంగా స్పందించింది. ఇదంతా చైనాపై చేసే దుష్ప్రచారం అని కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ మూలాల సమాచారాన్ని అందించాలని అన్ని దేశాలను WHO కోరింది.

చైనాలోని వుహాన్ ల్యాబ్​ నుంచే కరోనా లీక్ అయినట్లు గతంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పరిశోధనలు చేస్తున్న ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చిందని అనేక నివేదికలు వెల్లడించాయి. అయితే, ఈ ఆరోపణలకు రుజువులుగా ఉన్న సమాచారాన్నంతటినీ చైనా తుడిచిపెట్టేస్తోందని ఆరోపణలు వచ్చాయి. కరోనా జన్యుక్రమానికి సంబంధించిన నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్ నుంచి చైనా తొలగిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. వైరల్ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో వుహాన్​లో నమోదైన కేసులకు సంబంధించిన నమూనాల డేటాను కనిపించకుండా చేసిందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. కొవిడ్ వ్యాప్తిని అర్థం చేసుకోవడంలో చాలా కీలకమైన సమాచారం అదేనని చెప్పారు. వైరస్ ఎలా ఆవిర్భవించిందో తెలియకుండా గందరగోళం సృష్టించేందుకే చైనా ఈ పన్నాగాలు పన్నినట్లు తాము భావిస్తున్నామని తెలిపారు.

అయితే, ఈ ఆరోపణలన్నింటినీ చైనా ఎప్పటికప్పుడు కొట్టిపారేసింది. తమపై తప్పుడు ఉద్దేశాలతో ఈ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తింది. ప్రపంచదేశాల ఒత్తిడి మధ్య చాలా రోజుల తర్వాత డబ్ల్యూహెచ్ఓ బృందానికి చైనాలో పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. కరోనా మూలాలపై దర్యాప్తునకు చైనా వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం.. వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ ఉద్భవించిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని గతంలో ప్రకటించింది. అయితే కరోనా వాప్తి మొదలైన తొలినాళ్ల కీలక సమాచారాన్ని ఇచ్చేందుకు చైనా నిరాకరించిందని డబ్ల్యూహెచ్​ఓ బృందంలోని ఒకరు బ్రిటన్ వార్తా సంస్థకు చెప్పడం మళ్లీ అనుమానాలకు తావిచ్చినట్లైంది.

ABOUT THE AUTHOR

...view details