Toshakhana Case Imran Khan : ప్రభుత్వ కానుకలకు సంబంధించిన తోషఖానా కేసులో పాకిస్థాన్ తెహ్రీక్- ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను చుక్కెదురైంది. ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టు.. ఇమ్రాన్‌ను ఈ కేసులో దోషిగా తేల్చి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీనితో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ అదనపు న్యాయమూర్తి హుమయూన్ దిలావర్ తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది.
క్షణాల్లోనే అరెస్టు వారెంట్..
Pakistan Ex PM Arrested : మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన కోర్టు.. వెంటనే అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో క్షణాల వ్యవధిలోనే ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్‌లోని తన నివాసం నుంచి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
'ఇలా జరుగుతుందని ముదే ఊహించా'
తన అరెస్టుపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తన అరెస్టు ఊహించిందేనని ఇమ్రాన్ పేర్కొన్నారు. ముందుగానే రికార్డు చేసి పెట్టుకున్న తన ప్రసంగాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. 'ఇదంతా లండన్ ప్లాన్‌లో భాగమే. దాని అమలులో ఇది మరొక ముందడుగు. అయితే దీనిపై పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా, దృఢంగా ఉండాలి. పాక్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి' అని ఇమ్రాన్ ఖాన్ వీడియో చెప్పారు.
హైకోర్టుకు ఇమ్రాన్ పార్టీ..
ఇమ్రాన్ ఖాన్‌ను అక్రమ కస్టడీలో ఉంచారని ఆరోపిస్తూ ఆయన పార్టీ 'పీటీఐ'.. లాహోర్ హైకోర్టును ఆశ్రయించింది. ఇమ్రాన్‌ను అపహరించారని పిటిషన్‌లో పేర్కొంది. వెంటనే విచారణ చేపట్టి.. ఆయన్ను హైకోర్టు ముందు హాజరుపరచాలంటూ పంజాబ్ పోలీసులను, ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించింది. 'దాదాపు 200 మంది పోలీసులు ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి.. తుపాకీతో ఆయన్ను బెదిరించి అపహరించారు. కోర్టు తీర్పు కాపీని చూపించకుండానే కిడ్నాప్ చేశారు. ప్రభుత్వం ఇమ్రాన్‌ను అక్రమ కస్టడీలో ఉంచింది. ఈ నేపథ్యంలో భద్రత పరిస్థితి దృష్ట్యా ఇమ్రాన్ ఖాన్‌ను హైకోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించాలి' అని పీటీఐ నాయకుడు ఉమైర్ నియాజీ హైకోర్టును కోరారు. తోషఖానా కేసులో ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.