WHO CLIMATE CHANGE REPORT:ఆధునిక జీవనం కోసం జరుగుతున్న పర్యావరణ విధ్వంసం మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేయనుంది. పారిశ్రామిక యుగం ముందునాళ్లతో పోలిస్తే నేడు భూఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. మానవాళి సత్వరం మేల్కొనకపోతే 2100 సంవత్సరానికి భూ ఉష్ణోగ్రత 1.4 నుంచి 5.8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపం వల్ల నిప్పులు చెరిగే ఎండలు, నగరాలను సైతం ముంచెత్తే కుండపోత వర్షాలను చూస్తున్నాం. వాతావరణ మార్పుల వల్ల జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ కరోనా మహమ్మారే. ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినంగా జరుపుకొంటున్న సందర్భంలో ఈ వ్యాధుల గురించి అప్రమత్తం కావలసి ఉంది. నేడు కొత్తగా వ్యాపిస్తున్న ప్రతి మూడు అంటు వ్యాధుల్లో రెండు జంతువుల నుంచి మానవుల్లోకి లంఘించే రోగకారక సూక్ష్మజీవుల వల్ల పుట్టుకొచ్చినవే. ఈ వ్యాధులను నివారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పథ నిర్దేశం చేస్తోంది. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వేసవి కాలం ఎక్కువ రోజులు కొనసాగుతోంది. ఎండ వేడిమి పెరిగినప్పుడు దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యు వంటి వ్యాధులు విజృంభిస్తాయి. ఎలుకలు తామరతంపరగా వృద్ధిచెంది రోగాల వ్యాప్తికి కారణమవుతున్నాయి.
బ్లాక్ ప్లేగు వ్యాధి మళ్లీ?:మధ్యయుగాల్లో ఐరోపా జనాభాలో 60 శాతాన్ని కేవలం ఏడేళ్లలోనే తుడిచిపెట్టిన బ్లాక్ ప్లేగ్ వ్యాధి ఎలుకల వల్లనే వ్యాపించింది. ఇటీవల లాటిన్ అమెరికా, కరిబియన్ దేశాల్లో విజృంభించిన హంటా వైరస్, ఎరీనా వైరస్ (లస్సా జ్వరం) కూడా ఎలుకల నుంచి మానవులకు పాకినవే. రోగగ్రస్త ఎలుకల మూత్రంలో ఉండే లెప్టోస్పైరా బ్యాక్టీరియా మానవుల మూత్ర పిండాలను దెబ్బతీస్తుంది. మండు టెండలూ, భారీ వర్షాలు రెండూ ఎలుకల జనాభా పెరిగిపోవడానికి కారణమవుతాయి. అన్ని సీజన్లలో మానవులతో ఎలుకల సంపర్కం పెరుగుతోంది. ఇదే ప్లేగు, హంటా వైరస్, ఎరీనా వైరస్, లెప్టోస్పైరోసిస్‌ల వ్యాప్తికి అనుకూల పరిస్థితులను ఏర్పరుస్తోంది. 2003-05 మధ్యకాలంలో కరిబియన్ దీవుల్లోని గ్వాడలూప్‌లో ఎల్ నినో వల్ల వెంటవెంటనే ఎండలు, వానలు సంభవించిడం వల్ల లెప్టోస్పైరోసిస్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.