తెలంగాణ

telangana

జెలెన్​స్కీకి జిన్​పింగ్ ఫోన్​.. గంటకు పైగా చర్చ.. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి!

By

Published : Apr 26, 2023, 10:24 PM IST

ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీతో ఫోన్​లో మాట్లాడారు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్. రష్యా-ఉక్రెయిన్​ మధ్య నెలకొన్న యుద్ధాన్ని శాంతింపజేసేందుకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చైనా పునరుద్ఘాటించింది.

China President Xi Jinping Phone To Ukraine President Zelensky On Russia-Ukraine War
రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో ఫోన్​లో మాట్లాడిన చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​

రష్యా-ఉక్రెయిన్​ మధ్య నెలకొన్న యుద్ధాన్ని శాంతింపజేసేందుకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చైనా పునరుద్ఘాటించింది. ఈ సారి ఏకంగా చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​.. ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీకి ఫోన్​ చేసి మాట్లాడారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి రాజకీయ పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు శాంతియుతమైన చర్చలే సరైన మార్గమని జెలెన్​స్కీకి సూచించారు. జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. అణుయుద్ధంలో విజేతలెవ్వరూ ఉండరని హెచ్చరించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలైన తర్వాత జెలెన్‌స్కీతో జిన్‌పింగ్‌ ఫోన్​లో సంభాషించడం ఇదే తొలిసారి.

"అణుయుద్ధంలో విజేతలెవ్వరూ ఉండరు. ఈ విషయంలో ఇరు దేశాలు ప్రశాంతంగా ఉండాలి. ఓపికతో సమస్యను పరిష్కరించుకోవాలి. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని.. తర్వాత జరిగే పరిణామాలను పరిగణనలోకి తీసుకొని వ్యవహరించాలి. మానవత్వంతో ముందుకెళ్తూ సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం శాంతియుతమైన చర్చలే ఉత్తమమైన మార్గం"-

--షీ జిన్​పింగ్, చైనా అధ్యక్షుడు

ఈ సంక్షోభానికి పరిష్కారం కనుక్కుని తెరదించేందుకు.. అలాగే దీనిపై మాట్లాడేందుకు చైనా తరఫున ఓ ప్రత్యేక అధికారిని ఉక్రెయిన్‌కు పంపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది. ఇక జిన్​పింగ్​, జెలెన్​స్కీల మధ్య సుమారు గంటపాటు ఫోన్​ సంభాషణ జరిగినట్లు ఉక్రెయిన్​ తెలిపింది.

భారత్​, చైనా​ తటస్థ వైఖరి..
రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం విషయంలో చైనా మొదటినుంచి తటస్థ వైఖరిని ప్రదర్శిస్తూ వస్తోంది. మరోవైపు రష్యా పాల్పడుతున్న దుశ్చర్యను కూడా ఇప్పటివరకు ఖండించలేదు జిన్​పింగ్​ ప్రభుత్వం. కేవలం చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలుకుతోంది. మరోవైపు పాశ్చాత్య దేశాల నుంచి చైనాపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల రష్యాలో పర్యటించారు జిన్‌పింగ్‌. అధ్యక్షుడు పుతిన్​తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యా తమకు అత్యంత మిత్ర దేశమంటూ జిన్​పింగ్​ వ్యాఖ్యానించారు.

గతేడాది ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది పూర్తి చేసుకుంది. అయినా ఈ మారణకాండకు మాత్రం ముగింపు పలకట్లేదు ఇరు దేశాలు. ఈ యుద్ధంలో ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే అఫ్గానిస్థాన్‌ మానవ సంక్షోభంతో తల్లడిల్లిన అంతర్జాతీయ సమాజం ముందుకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పేరుతో మరో సంక్షోభం వచ్చిపడింది. ఈ యుద్ధాన్ని ప్రపంచలోని పలు దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్న వేళ భారత్‌ మాత్రం ముందు నుంచి ఎంతో వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఇతర దేశాల నుంచి అనేక ఒత్తిళ్లు, విజ్ఞప్తులు వచ్చినా దేశ ప్రయోజనాలే తమ మొదటి ప్రాధాన్యమని సూచిస్తూ తటస్థ వైఖరిని ప్రదర్శిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details