Himalayan Cordyceps Gold : భారత భూ భాగంలోకి చైనా సైనికులు పదేపదే చొరబాట్లకు పాల్పడుతున్నారు. ఇటీవల తవాంగ్ సెక్టార్‌లో అక్రమంగా ప్రవేశించిన క్రమంలో భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. బంగారం కంటే విలువైన ఓ ఫంగస్ కోసమే చైనా సైనికులు చొరబడుతున్నారని సమాచారం. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైనికులు అనేకసార్లు భారత భూభాగంలోకి ఈ ఫంగస్ కోసమే చొరబడినట్లు ఇండో - పసిఫిక్ ఫర్ స్ట్రాటెజిక్ కమ్యూనికేషన్స్ ఓ నివేదికలో వెల్లడించింది.
భారత్‌లో చైనా చొరబాటు.. బంగారం కంటే విలువైన ఆ 'ఫంగస్' కోసమేనా..? - బంగారం కంటే విలువైన ఫంగస్
Himalayan Cordyceps Gold : ఇటీవల భారత్ భూ భాగంలోకి చైనా అక్రమం చొరబాటుకు ప్రయత్నించింది. భారత్ సైన్యం వారిని తిప్పికొట్టింది. అయితే వారు హిమాలయ ప్రాంతంలో దొరికే బంగారం కంటే అతి విలువైన ఓ 'ఫంగస్' కోసమే ఈ ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు. అసలేంటా ఫంగస్..?
పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్‌ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్‌గా చెబుతుంటారు. అత్యంత అరుదుగా లభించే ఈ ఫంగస్‌లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి పసుపు, కాషాయ రంగులో సన్నటి పోగులా ఉండే వీటిని సూపర్ మష్రూమ్స్‌గా పిలుస్తారు. ఈ కార్డిసెప్స్ అత్యంత ఖరీదైనవి, బంగారం కంటే వీటి ధర ఎక్కువట. కార్డిసెప్స్ 10 గ్రాముల ధర సుమారు 700 డాలర్లు (రూ. 56 వేలు) ఉన్నట్లు తెలుస్తోంది. మేలైన రకం కిలో ధర లక్షల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లోని హిమాలయ ప్రాంతంతోపాటు చైనా నైరుతిలోని కింగై - టిబెట్ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో కార్డిసెప్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. 2022 నివేదిక ప్రకారం, అంతర్జాతీయంగా కార్డిసెప్స్ మార్కెట్ విలువ వెయ్యి మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ముందుంది. అయితే, అత్యధికంగా ఉత్పత్తయ్యే కింగై ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా వీటి సాగు క్షీణించింది. దీంతో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. తాజాగా వీటిని అన్వేషించుకుంటూనే అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా సైనికులు చొరబడినట్లు ఐపీసీఎస్సీ తెలిపింది.