Chandrayaan 3 Pakistan Reaction : ఎప్పుడూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కే పాకిస్థాన్.. చంద్రయాన్-3 విజయంపై మాత్రం సానుకూలంగా మాట్లాడింది. ఈ విషయంపై ఆలస్యంగా స్పందించిన పాక్.. చంద్రయాన్-3 విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. చంద్రయాన్-3 సక్సెస్‌ను 'గొప్ప శాస్త్రీయ విజయం'గా అభివర్ణించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగడంపై ఆలస్యంగా స్పందించింది పాకిస్థాన్. ప్రయోగం విజయవంతమైన రెండు రోజుల తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించింది. సంపన్న దేశాలు ప్రయోగాల కోసం చేసే ఖర్చుతో పోలిస్తే భారత్.. చంద్రయాన్-3 మిషన్‌ను తక్కువ బడ్జెట్‌తోనే చేపట్టి విజయం సాధించిందని పేర్కొంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రశంసలకు అర్హులని తెలిపింది.
'జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను దింపడం గొప్ప శాస్త్రీయ విజయం. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు' అని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా తెలిపారు. కాగా.. పాకిస్థాన్ మీడియా మాత్రం చంద్రయాన్-3 విజయం పట్ల ప్రశంసలు కురిపించింది. దినపత్రికల్లో చంద్రయాన్-3 సక్సెస్ వార్తను మొదటి పేజీలో కవర్ చేసింది.
Chandrayaan 3 On Pakistan Media : ప్రముఖ వార్తాపత్రిక డాన్ తన సంపాదకీయంలో 'ఇండియాస్ స్పేస్ క్వెస్ట్' పేరుతో ఓ శీర్షికను ప్రచురించింది. చంద్రయాన్-3 మిషన్ విజయం చరిత్రాత్మకమని పేర్కొంది. ధనిక దేశాలు భారీ మొత్తంలో ఖర్చుపెట్టి చంద్రుడిపై ల్యాండింగ్ అయ్యాయని.. భారత్ మాత్రం తక్కువ బడ్జెట్‌తోనే చంద్రుడిపై అడుగుపెట్టిందని డాన్ వార్తాపత్రిక తన శీర్షికలో రాసుకొచ్చింది. 'పోలికలు నిజానికి సరికాదు. కానీ భారత్ సాధించిన విజయం నుంచి పాకిస్థాన్ నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి' అని పేర్కొంది.
Pakistani Media On Chandrayaan 3 :అలాగే ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ అనే మరో వార్తాపత్రిక 'ఇండియాస్ లూనార్ లారెల్' శీర్షికతో చంద్రయాన్-3 మిషన్ గురించి రాసింది. అందులో అమెరికా, రష్యా, చైనా చేపట్టలేని ప్రయోగాన్ని భారత్ చేసిందని పేర్కొంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపిన ఏకైన దేశం భారత్ అని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ఈ శీర్షికలో ప్రశంసించింది.