Canada Wildfires Today 2023 : ఉత్తర కెనడాలో కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్ నగరం వైపు అగ్నికీలల వేగంగా వ్యాపిస్తుండడం వల్ల ప్రజలంతా ఖాళీ చేయాలంటూ స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ దావానలం పదుల కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ వారాంతంలో ఎల్లోనైఫ్ శివార్లకు సమీపిస్తుందని పేర్కొంది. ఆ నగరంలో ఉండాలనుకుంటే మీతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే అంటూ అప్రమత్తం చేసింది.
Canada Wildfire Smoke : ప్రజలను తరలించేందుకు విమానాలను సిద్ధంగా ఉంచామని నగర మేయర్ రెబెక్కా ఆల్టీ తెలిపారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికీ అత్యంత క్లిష్ట సమయమని, వీలైనంత వరకు ఒకరికొకరు సాయం చేసుకోవాలని సూచించారు. వాహనంలో ఖాళీ ఉంటే ఇతరులను ఎక్కించుకోవాలని కోరారు.
మూడు వేల మంది జనాభా కలిగిన హే రివర్ పట్టణంలో కూడా తరలింపు ప్రక్రియ జరుగుతోంది. బలమైన గాలుల కారణంగాకార్చిచ్చువేగంగా వ్యాపిస్తోందని ఓ అధికారి వెల్లడించారు. కెనడా వ్యాప్తంగా వెయ్యి 70 కార్చిచ్చులు క్రియాశీలకంగా ఉంటే నార్త్ వెస్ట్ టెర్రిటరీస్‌లోనే 230 ఉన్నాయని అగ్నిమాపక విభాగం పేర్కొంది. మంటలను అదుపు చేయడానికి 100 మంది సైనికులను పంపించినట్లు తెలిపింది. మంటల ధాటికి ఇప్పటి వరకు లక్షా 36 వేల చదరవు కిలోమీటర్ల భూమి కాలిపోయిందని పేర్కొంది. 1989లో సంభవించిన కార్చిచ్చు వల్ల 76 వేల చదరపు కిలోమీటర్ల భూమి దహించుకుపోగా ప్రస్తుతం దాని కంటే రెట్టింపు నేల కాలిబూడిదైందని వెల్లడించింది.