Canada Student Visa Deposit :ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లే విదేశీ విద్యార్థులపై నిబంధనలను కఠినతరం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకొనే విద్యార్థుల ఆర్థిక సంసిద్ధతను పెంచేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో స్టూడెంట్ డిపాజిట్‌ను ప్రస్తుతమున్న 10వేల డాలర్ల నుంచి 20,635 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.
"కెనడాలో జీవన వ్యయం విషయంలో అంతర్జాతీయ విద్యార్థులు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకే జీవన వ్యయ పరిమితిని సవరిస్తున్నాం. తద్వారా ఇక్కడి పరిస్థితులను వారు అర్థం చేసుకోగలరు. విద్యార్థుల అవసరాలకు తగిన వసతి కల్పనకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాం. ఆర్థిక బలహీనత, దోపిడీ నుంచి అంతర్జాతీయ విద్యార్థులను తాజా నిర్ణయాలు రక్షిస్తాయి."
--మార్క్ మిల్లర్, కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి
తాజా నిర్ణయం కేవలం పెరుగుతున్న జీవన వ్యయానికి సంబంధించే కాకుండా తగిన వసతిని పొందడంలోనూ అంతర్జాతీయ విద్యార్థులకు దోహదపడుతుందన్నారు మార్క్ మిల్లర్. వీటితోపాటు అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్ బయట పని పరిమితిపై ఇచ్చిన మినహాయింపు (వారానికి 20 గంటల కంటే ఎక్కువ)ను వచ్చే ఏడాది ఏప్రిల్ 30వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కెనడాలో ఉన్నవారితోపాటు డిసెంబర్ 7నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు.