Jo Biden White House: అమెరికాలో ఓ చిన్న ప్రైవేటు విమానం శనివారం పొరపాటున అధ్యక్షుడి అధికారిక నివాసం చుట్టూ ఉండే నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బృందం వెంటనే బైడెన్‌తో పాటు ప్రథమ మహిళను కొద్దిసేపు మరో సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం వారికి ఎలాంటి ముప్పు లేదని శ్వేతసౌధం అధికారి ఒకరు ప్రకటించారు.
బైడెన్ ఆయన సతీమణి జిల్ బైడెన్‌తో కలిసి ఇటీవల డెలావేర్‌లోని రిహోబత్ బీచ్‌లోని అధ్యక్ష విడిదికి చేరుకున్నారు. రాజధాని వాషింగ్టన్‌కు ఇది 200 కి.మీ దూరంలో ఉంటుంది. అయితే, శనివారం ఓ చిన్న విమానం పొరపాటున నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఓవైపు విమానాన్ని బయటకు తరుముతూనే.. మరోవైపు అధ్యక్షుడిని భారీ బందోబస్తు మధ్య మరో సురక్షిత ప్రాంతానికి తరలించారు. విమానం పొరపాటున ప్రవేశించిందని తెలియగానే.. తిరిగి అధ్యక్షుడు నివాసానికి చేరుకున్నారు.
విమానంలో ఉన్న పైలట్ సరైన రేడియో ఛానల్ ద్వారా అందుబాటులోకి రాలేదని అధికారులు తెలిపారు. అలాగే ఫ్లైట్ గైడెన్స్‌ను కూడా ఆయన పాటించలేదని పేర్కొన్నారు. పైలట్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తామని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విమానం దాడి లక్ష్యంతో అటుగా రాలేదని స్పష్టమైందన్నారు. నిషేధిత ప్రాంతంపై పైలట్‌కు అవగాహన లేకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగిందని తేలిందన్నారు.