Australia election result:ఆస్ట్రేలియా ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ విజయ పథాన పయనిస్తోంది. ఇంకా లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉన్నప్పటికీ ఫలితాల సరళిని గమనించిన ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ఓటమిని అంగీకరించారు. అమెరికా జపాన్, భారత నేతలతో మంగళవారం జరిగే శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని హాజరుకావాల్సిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. "ఈ దేశంలో అనిశ్చితి ఉండకూడదు. ఈ దేశం ముందడుగు వేయాలి. వచ్చే వారం ముఖ్యమైన సమావేశాలు ఉన్నందువల్ల ఇక్కడి ప్రభుత్వంపై స్పష్టత ఉండాలన్నదే నా ఉద్దేశం" అని మోరిసన్ తెలిపారు.
Anthony Albanese Modi: 2007 తర్వాత లేబర్ పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అల్బనీస్ సర్కారుతో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఇరుదేశాల ప్రయోజనాలపై కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
మోరిసన్‌కు చెందిన లిబరల్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణం 38 చోట్ల ఆధిపత్యంలో ఉంది. లేబర్ పార్టీ 71 స్థానాల్లో ముందంజలో ఉంది. 2 చోట్ల పోటీ హోరాహోరీగా సాగుతోంది. చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా కొన్నిచోట్ల ముందంజలో ఉన్నారు. దీంతో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని, మైనార్టీ ప్రభుత్వం ఏర్పడవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆస్టేలియా పార్లమెంటులోని ప్రతినిధుల సభలో మొత్తం 151 స్థానాలు ఉన్నాయి. 2001 తర్వాత అత్యధిక స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న ఆస్టేలియావాసులకు ఉపశమనం కల్పించేందుకు ఆర్థికసాయాన్ని సామాజిక భద్రతను పెంచుతామని లేబర్ పార్టీ హామీ ఇచ్చింది. పక్కనే ఉన్న సాల్మన్ దీవుల్లో వైనా సైనిక ఉనికికి స్పందనగా పొరుగు దేశాల సైన్యాలకు శిక్షణ ఇచ్చేందుకు 'పసిఫిక్ డిఫెన్స్ స్కూల్'ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. 2050 నాటికి గ్రీన్‌హౌస్ ఉద్గారాలను ఏకంగా 48 శాతం తగ్గిస్తామంది.