ASEAN Summit 2023 Modi :ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ తరువాత జరిగిన మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందేందుకు ఆసియాన్ దేశాలు పరస్పరం సహకారం అందించుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. దాంతోపాటు దక్షిణాది దేశాల వాణిని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో గురువారం జరిగిన 20వ ఆసియాన్-ఇండియా సదస్సులో పాల్గొన్న మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండో పసిఫిక్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. మానవాభివృద్ధికి ఆసియాన్ దేశాలు కృషి చేయాలని సూచించారు.
ASEAN Meeting Jakarta 2023 :ఇండో-పసిఫిక్ దేశాల దృక్పథాన్ని భారత్ గౌరవిస్తుందని.. సమావేశంలో పాల్గొన్న సభ్యదేశాల ప్రతినిధులకు మోదీ స్పష్టం చేశారు. ఆసియాన్ దేశాలు వృద్ధికి కేంద్రంగా ఉంటాయని.. అవి ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు. '21 శతాబ్దాన్ని.. ఆసియా శతాబ్దంగా ఆయన అభివర్ణించిన మోదీ.. 'ఇది మనందరి శతాబ్దమంటూ' వ్యాఖ్యానించారు.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. ఆసియాన్ దేశాల పరస్పర సహకారంతో స్థిరమైన పురోగతి జరుగుతోందన్నారు నరేంద్ర మోదీ. భారత ఈస్ట్ యాక్ట్ విధానానికి మూల స్తంభంగా 'ఆసియాన్' ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ఆసియాన్-ఇండియా భాగస్వామ్యం నాలుగో దశాబ్దంలోకి అడుగుపెట్టిందని సదస్సులో మోదీ పేర్కొన్నారు.
ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్).. ఈ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన సమూహాలలో ఒకటిగా పరిగణించవచ్చు. ఆసియాన్‌లో భారత్‌తోపాటు అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియాలు చర్చల భాగస్వాములుగా ఉన్నాయి.