అమెరికాలో ఉంటున్నభారత సంతతి పౌరులు అగ్రరాజ్యంలో ఎటువంటి సమస్యలు సృష్టించరని, చట్టాలను గౌరవిస్తారని అమెరికా చట్టసభ సభ్యుడొకరు వెల్లడించారు. అమెరికా జనాభాలో ఒక శాతం ఉన్నవీరంతా.. అక్కడి పన్నుల్లో మాత్రం 6శాతం వాటా కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభలో ప్రసంగం చేసిన ఓ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి.. తన నియోజకవర్గంలో అత్యధికంగా నివసించే భారత సంతతి పౌరులను ఉద్దేశిస్తూ ఈ విధంగా మాట్లాడారు.
"అమెరికా సమాజంలో సుమారు ఒక్క శాతం ఉన్నప్పటికీ పన్నుల్లో వారి వాటా ఆరు శాతం. వారు ఎటువంటి సమస్యలు సృష్టించరు. చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటారు. తీవ్ర కుంగుబాటు, ఓవర్‌డోస్‌లతో అత్యవసర వైద్యం కోసం వచ్చే ఇతర పౌరులకు ఉండే సమస్యలు భారత సంతతి పౌరులకు లేవు. అత్యంత ఉత్పాదకత లేదా కుటుంబ ఆధారమైన వారి నేపథ్యం ఎంతో ఉత్తమమైనది" అని అమెరికా ప్రతినిధుల సభలో చేసిన స్వల్ప ప్రసంగంలో చట్టసభ సభ్యుడు, రిపబ్లికన్ నేత రిచ్ మెక్‌కార్మిక్ పేర్కొన్నారు.