తెలంగాణ

telangana

ETV Bharat / international

నష్టాల అంచుల్లో మరో అమెరికా బ్యాంక్​.. 30 బిలియన్​ డాలర్ల ప్యాకేజీ ప్రకటన - america bank crisis

వారం రోజుల్లో రెండు బ్యాంక్‌ల మూతపడడాన్ని చూసిన అమెరికాలో మరో బ్యాంక్‌ సంక్షోభం అంచున ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడి పెద్ద బ్యాంకులు ఏకతాటిపైకి వచ్చాయి. 2008 నాటి లేమన్‌ బ్రదర్స్‌ స్థాయి సంక్షోభం లాంటి మరో భారీ సంక్షోభం రాకుండా ఉమ్మడి చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు పతనం అంచుల్లో ఉన్న ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు 30 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి.

first republic bank latest news
నష్టాల అంచుల్లో అమెరికా మరో బ్యాంకు

By

Published : Mar 17, 2023, 10:37 PM IST

Updated : Mar 17, 2023, 10:44 PM IST

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌ పతనం అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. అక్కడ మరికొన్ని బ్యాంకులూ అదే బాటలో ఉన్నాయనే వార్తలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. ఐరోపాలో స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్‌ స్వీస్‌ బ్యాంకు కూడా ప్రమాద ఘంటికలు మోగించడం వల్ల ఆందోళన తీవ్రమైంది. మరోసారి 2008 నాటి లేమన్‌ బ్రదర్స్‌ స్థాయి సంక్షోభం తలెత్తుతుందోననే అనుమానాలు బలంగా వినిపిస్తున్న క్రమంలో అమెరికాలోని 11 బడా బ్యాంకులు ఏకతాటిపైకి వచ్చాయి. మరో భారీ సంక్షోభం రాకుండా ఉమ్మడి చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు పతనం అంచుల్లో ఉన్న ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు 30 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి. ఫస్ట్‌ రిపబ్లిక్‌కు నిధులు సమకూరుస్తున్న వాటిలో జేపీ మోర్గాన్‌ చేజ్‌, బ్యాంక్ ఆఫ్‌ అమెరికా, సిటీ గ్రూప్‌, యూఎస్‌ బ్యాంక్‌ వంటి పెద్ద బ్యాంకులు ఉన్నాయి. తాము ఒకే వేదిక మీదకు రావడం అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో సూచిస్తోందని సదరు బ్యాంకులు పేర్కొన్నాయి.

ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌లో కూడా సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్ తరహాలో టెక్‌, అంకుర సంస్థల డిపాజిట్లే అధికంగా ఉన్నాయి. డిసెంబరు 31 నాటికి ఈ బ్యాంకులో 176.4 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే, బ్యాంకింగ్‌ వ్యవస్థపై వస్తున్న వదంతులతో ఖాతాదారులు ఇటీవల భారీ ఎత్తున నగదును విత్​డ్రా చేసుకుంటున్నారు. ఈ పరిణామంతో ద్రవ్య లభ్యత సమస్య ఏర్పడి దివాలా తీసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో 11 అమెరికా బ్యాంకులు ఐక్యంగా ఏర్పడి ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి. ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంకులో అనేక మంది బిలియనీర్లు ఖాతాదారులుగా ఉన్నారు. వారందరికీ ఈ బ్యాంకు సులభమైన షరతులతో సేవలందిస్తోంది. మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సైతం ఈ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంకు షేరు గురువారం ఓ దశలో 36 శాతం నష్టపోయింది. కానీ, 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించడం వల్ల తిరిగి పుంజుకుంది. చివరకు 10 శాతం లాభంతో ముగిసింది.

2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఆరంభంలోనూ బ్యాంకులు ఇలాగే ఏకతాటిపైకి వచ్చి బలహీనంగా ఉన్న బ్యాంకులను ఆదుకునేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని బడా బ్యాంకులు ఇతర బ్యాంకులను కొనుగోలు చేసి సంక్షోభం మరింత ముదరకుండా చర్యలు తీసుకున్నాయి. కానీ, అప్పటికే పరిస్థితి చేదాటడం వల్ల సంక్షోభం అనివార్యమైంది. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు బ్యాంకులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాయి.

Last Updated : Mar 17, 2023, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details