ఘోర ప్రమాదం.. నదిలోయలోకి దూసుకెళ్లిన విమానం.. 68 మంది మృతి
12:33 January 15
11:27 January 15
ఘోర ప్రమాదం.. నదిలోయలోకి దూసుకెళ్లిన విమానం.. 68 మంది మృతి
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా.. ఓ విమానం అదుపుతప్పి నదిలోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. 72 సీట్ల సామర్థ్యం కలిగిన యెటి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానంలో.. 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పాత విమానాశ్రయానికి.. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. యెటి ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కాఠ్మాండూలోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి ఉదయం 10 గంటల 33 నిమిషాలకు బయల్దేరినట్లు నేపాల్ పౌర విమానయాన శాఖ తెలిపింది.
ఐదుగురు భారతీయులు మృతి
ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 72 ప్రయాణికుల్లో 15 మంది విదేశీయులు ఉన్నట్లు యెటి ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. వీరిలో ఐదుగురు భారతీయులున్నట్లు తెలిపింది. వారిని అభిషేక్ కుష్వాహా, బిశాల్ శర్మ, అనిల్ కుమార్ రాజ్‌భర్, సోను జైస్వాల్, సంజయ జైస్వాల్‌గా గుర్తించారు. మరింత సమాచారం కోసం నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.
వీరితోపాటు నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లు.. ఆస్ట్రేలియా, ఐర్లాండ్, అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఒక్కో ప్రయాణికుడు విమానంలో ఉన్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ ఘోర దుర్ఘటన నుంచి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువని అధికారులు వ్యాఖ్యానించారు.
దర్యాప్తునకు కమిటి ఏర్పాటు
విమానం కూలిన విషయం తెలుసుకున్న అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం విమానాశ్రయాన్ని మూసివేసినట్లు అధికారుల వెల్లడించారు. విమానం కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానానికి చెందిన ఒక్క రెక్క తప్ప మొత్తం కాలిపోయినట్లు వెల్లడించారు. ప్రమాద కారణాలను అన్వేషించేందుకు అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అత్యవసర మంత్రి వర్గ సమావేశం నిర్వహించి.. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఘటనాస్థలాన్ని హోంమంత్రి రబీ లమిచ్చానేతో కలిసి ప్రధాని ప్రచండ పరిశీలించనున్నారు. విమాన ప్రమాదానికి సంఘీభావంగా నేపాల్‌లో రేపు సంతాప దినంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నేపాల్‌లో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పులు, కొండ ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉండటం వల్ల విమానాలు ల్యాండింగ్ చేయడం కష్టంగా మారుతున్నట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత మే నెల 29న జరిగిన ఘటనలో విమానంలోని 22మంది చనిపోయారు. 2018 మార్చిలో 51మంది, 2016లో 23 మంది, 2012సెప్టెంబర్‌లో 19 మంది, మేలో 15 మంది విమాన ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు.