యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ బాధితులపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో కనీసం ఒకరు లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. నెదర్లాండ్స్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ 'ది లాన్సెట్'లో ప్రచురితమైంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అయితే, వీరిలో కొందరికి కొవిడ్ లక్షణాలు దీర్ఘకాలం పాటు వేధిస్తున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో లాంగ్‌కొవిడ్ లక్షణాలు ఏమేరకు ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా నెదర్లాండ్స్‌లోని 76,400 మందిని సర్వే చేసి దాదాపు 23 రకాల లాంగ్ కొవిడ్ లక్షణాలతో కూడిన ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు.
ఎనిమిదిలో ఒకరికి..:ఈ సర్వేను మార్చి 2020 నుంచి ఆగస్టు 2021 వరకు చేపట్టగా అందులో దాదాపు 24సార్లు వారినుంచి సమాధానాలు తీసుకున్నారు. ఈ క్రమంలో లాంగ్‌కొవిడ్ లక్షణాలను కచ్చితంగా అంచనా వేసేందుకు గాను.. సర్వేలో పాల్గొన్న వారు కొవిడ్‌కు ముందు, కొవిడ్ తర్వాత ఏ విధమైన లక్షణాలు ఎదుర్కొన్నారనే విషయాన్ని పరిశోధకులు రికార్డు చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 5.5శాతం మంది (4200) కొవిడ్ బారినపడగా.. అనంతరం ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత వారిలో 21శాతం మందిని కనీసం ఒక లక్షణం మూడు నుంచి ఐదు నెలలపాటు వేధించినట్లు వెల్లడించారు. కొవిడ్ సోకని వారిలో సుమారు తొమ్మిది శాతం మంది ఇదే విధమైన సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.