ప్రపంచదేశాలను కలవరపెడుతోన్న కరోనా మహమ్మారి తొలి దశ అదుపులోకి రాకముందే.. చాలా దేశాల్లో కరోనా 2.0 మొదలైంది. ఈ దశలో ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. దీనితోనే ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుంటే.. ఇంతలో కరోనా 3.0 విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది. మరీ ముఖ్యంగా ఐరోపా దేశాలపై 2021 ఆరంభంలో వైరస్ తీవ్రస్థాయిలో విజృంభించే ప్రమాదముందని స్పష్టం చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి డేవిడ్ నబారో ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.
అందుకే కరోనా 3.0..
ఐరోపా దేశాలు రెండో దశ కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో విఫలమయ్యాయని డేవిడ్ తెలిపారు. ఫలితంగానే మూడోదశ రూపంలో విజృంభిస్తోందన్నారు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలోనే వైరస్ సంక్రమణకు అడ్డుకట్టవేసే అవకాశాన్ని చేజార్చుకున్నారని.. ఇప్పటికైనా దృష్టి సారించకపోతే వచ్చే ఏడాది తొలినాళ్లలో మూడోదశ ఖాయమని హెచ్చరించారు నబారో. లాక్డౌన్ వంటి మార్గదర్శకాలను పాటించకుండానే వైరస్ను అదుపులోకి తెచ్చేందుకు ఐరోపా దేశాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఇలాంటి చర్యలతో ఆయా దేశాలు భవిష్యత్తులో భారీమూల్యమే చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి:'సమష్టి కృషితోనే కరోనా మహమ్మారిని అరికట్టగలం'