కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్ కారణంగా చాలా దేశాలు ఆంక్షల చట్రంలోకి జారుకున్నాయి. ఈ నేపథ్యంలో.. కొవిడ్‌పై పోరుకు చైనా సహకారం అవసరమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొవిడ్ పుట్టుకకు సంబంధించి చైనా మరింత సమాచారం అందించేందుకు ముందుకు వస్తేనే కొవిడ్ పై పోరాటంలో ముందడుగు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అభిప్రాయపడ్డారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న టెడ్రోస్ర్.. రీ ఇన్‌ఫెక్షన్ ముప్పు సైతం అధికంగా ఉన్నట్లు తెలిపారు. సెలవులు, పండుగలు కారణంగా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆయన కేసులు పెరిగితే ఆరోగ్య వ్యవస్థలపై భారం పడటమే కాకుండా మరణాలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు. పండుగల వేళల్లో ప్రజలు గుమికూడకుండా ఉండాలని సూచించారు.
వ్యవస్థలపై దారుణం..
డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఇతర వేరియంట్‌లతో పోల్చితే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉంటుందని ఇప్పుడే అంచనా వేయడం అవివేకమే అవుతుందని అభిప్రాయపడ్డారు. రోగనిరోధక వ్యవస్థలను ఒమిక్రాన్ వేరియంట్ తప్పించుకుంటోందన్న సౌమ్య స్వామినాథన్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆరోగ్య వ్యవస్థలపై భారం పడుతుందని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ గురించి స్పష్టమైన సమాచారం ఇంకా లేనందున ఇది ఒక సవాల్‌గా మారిందని సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.