బెన్ జాన్...మితవాద తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడైన 21 ఏళ్ల శ్వేతజాతి యువకుడు. తన 18ఏళ్ల వయసు నుంచే మితవాద ఉగ్ర సంబంధిత(right wing books uk) కథనాలు చదవడం, బాంబుల తయారీ మ్యానువల్‌ను డౌన్లోడ్ చేసుకోవడం వంటి పనులు చేస్తూ పోలీసుల కంట్లో పడ్డాడు. ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లో నివాసం ఉండే ఈ యువకుడు నాజీ సంబంధిత పుస్తకాలు చదివేవాడు. స్వలింగ సంపర్కులు, వలసదారులు, ఉదారవాదులను వ్యతిరేకిస్తూ లేఖలు రాశాడు. నాజీ సానుభూతిపరుడైన ఈ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
2021 ఆగస్టు 11న బెన్ జాన్(ben john leicester) దోషిగా తేలాడు. యువకుడు సేకరిస్తున్న సమాచారం.. ఉగ్రదాడులకు ప్రేరేపించే అవకాశం ఉందని జ్యూరీ అభిప్రాయపడింది. ఇలాంటి నేరానికి 15ఏళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంది. చివరకు యువకుడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. మరో రెండేళ్ల పాటు లైసెన్స్ రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల పాటు ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. సంతకం పెట్టాలని ఆదేశించింది.
ఇంత జరిగిన తర్వాత.. బెన్ జాన్ జైలు మెట్లు ఎక్కలేదు. కోర్టు గది నుంచి స్వేచ్ఛగా బయటకు వచ్చాడు. అదీ ఒక్క షరతుతో..
అదేంటంటే..
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి టిమోతీ స్పెన్సర్.. దోషికి ఆసక్తికరమైన ఆఫర్ ఇచ్చారు. జైలుకు వెళ్లకుండా ఉండాలంటే పుస్తకాలు చదవాలని ఆదేశించారు. గొప్ప పేరు సాధించిన నవలలు చదివినన్ని రోజులు.. జైలుకు వెళ్లకుండా ఉండొచ్చని తీర్పు చెప్పారు. ప్రఖ్యాత రచయిత జేన్ ఆస్టెన్ రాసిన 'ప్రైడ్ అండ్ ప్రిజుడస్' (Pride and Prejudice) నవల చదవాలని సిఫార్సు చేశారు. దీనితో పాటు, విలియం షేక్స్పియర్(William Shakespeare), థామస్ హార్డీ, ఛార్లెస్ డికెన్స్ వంటి రచయితలు రాసిన పుస్తకాలు చదవాలని సూచించారు. పుస్తకాలు చదివాడా? లేదా? అన్న విషయంపై ప్రతి నాలుగు నెలలకోసారి పరీక్షించనున్నట్లు చెప్పారు.
"నువ్వు(జాన్‌ను ఉద్దేశించి) మంచి స్నేహితులు అసలే లేని ఏకాంత వ్యక్తివి. అధిక తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు జాన్‌ను తమతో చేర్చుకునే ప్రమాదం ఉంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి హానికారక ఘటనలు జరగలేదు. క్లాసిక్స్ చదవడం(english classic novels) ద్వారా నువ్వు దీని నుంచి బయటపడొచ్చు. నాకు మాటిస్తావా? (ఇస్తాను అని జాన్ సమాధానం). డికెన్స్, ఆస్టెన్ పుస్తకాలు చదివావా? ముందుగా ప్రైడ్ అండ్ ప్రిజుడస్ చదువు. ఆ తర్వాత 'ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్', '12th నైట్' పూర్తి చెయ్. జనవరి 4న నిన్ను పరీక్షిస్తా. నువ్ ఏం చదివావో నాకు చెప్పాలి. అబద్దాలు చెప్తున్నట్టు అనిపిస్తే నువ్వే చిక్కుల్లో పడతావు. ఇక నుంచి నీ ప్రతి అడుగును కోర్టు గమనిస్తుంది. నన్ను తలదించుకునేలా చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు!"
-టిమోతీ స్పెన్సర్, న్యాయమూర్తి
శిక్ష పడకుండా జాన్ కొద్దిలో తప్పించుకున్నాడని యువకుడి న్యాయవాదితో జడ్జి పేర్కొన్నారు. శ్వేతజాతి ఆధిపత్య భావజాలం కలిగిన కథనాలు చదవకుండా ఉన్నంతకాలం జైలులో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:ప్రపంచ వింత.. 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ!