పాఠశాలలు తెరిచి రెండు వారాలు కూడా కాలేదు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని 41 పాఠశాలల్లో ఒక్కసారిగా కరోనా విజృంభించింది. వందల సంఖ్యలో విద్యార్థులు, టీచర్లు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ప్రాథమిక, ఉన్నత, వృత్తివిద్య(ట్రేడ్) పాఠశాలలన్నింటా వైరస్ వ్యాప్తి చెందింది. జర్మనీలో ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. విద్యాసంస్థల్లో కరోనా ప్రబలితే క్రమేపీ విద్యార్థులు, టీచర్ల నుంచి వారి కుటుంబ సభ్యులకూ వైరస్ సోకి అది సామాజిక సంక్రమణానికి దారి తీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
జర్మనీలో విద్య అంశం దేశ ఫెడరల్ ప్రభుత్వం చేతిలో ఉండదు. రాష్ట్రాలే నిబంధనలు రూపొందించుకుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో వేసవి సెలవులు కొనసాగుతుండగా.. మరికొన్ని చోట్ల ఇటీవలే బడులను పునఃప్రారంభించడానికి నిర్ణయించారు. అందులో బెర్లిన్ ఒకటి. పైగా పిల్లలు తరగతి గదిలో పాఠాలు వింటున్నప్పుడు మాస్కులు తీసేయవచ్చంటూ సడలింపులు కూడా ఇచ్చారు. వీటిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.