బ్రిటన్ ప్రధాని తనకు అనుకూలంగా నిధులు కేటాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా వ్యాపారవేత్త జెన్నిఫర్ అర్క్యురీ బోరిస్ జాన్సన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని బోరిస్ తన హృదయాన్ని గాయపరిచి తనను అవమానించినట్లు తెలిపారు. తనను బోరిస్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. లండన్‌లోని ఓ ప్రముఖ షోలో బోరిస్‌తో తనకున్న సంబంధం గురించి పలు విషయాలు పంచుకున్నారు అర్క్యురీ.
'నేను నీతో చాలా విశ్వాసం, నమ్మకంతో ఉన్నాను. నీ రహస్యాలు నాతో దాచుకున్నాను. నేను నీకో మంచి స్నేహితురాలిలా ఉన్నాను. నువ్వు(బోరిస్‌ను ఉద్దేశించి) నా మనసుకు గాయం చేశావు. నన్నో సమస్యగా భావించావు. నీ ప్రవర్తనతో నా గుండె పగిలిపోయింది. నన్ను ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం కావట్లేదు. నేను కేవలం ఒక రాత్రి కోసమే ఉన్నట్లు భావించావు. లేదంటే నేను ఏదో బార్ ముందు కనిపించిన మహిళలా అనుకున్నావు కానీ నీకు నా గురించి తెలుసు.'-జెన్నిఫర్ అర్క్యురీ
ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ బోరిస్ విముఖత చూపిస్తున్నారని అర్క్యూరీ ఆరోపించారు.
'నేను ఫోన్ చేసినప్పుడు ఆయన నా గొంతు విన్నారు. మాట్లాడింది బోరిస్ అని నాకు తెలుసు. నన్నెందుకు బ్లాక్ చేశావ్? అని అడిగాను. నేనేం సమస్యలు సృష్టించడానికి ఫోన్ చేయలేదు. ఏం జరిగిందో తెలుసుకోవడానికే ప్రయత్నించాను. అతను వెంటనే ఫోన్ కట్ చేశారు.'-జెన్నిఫర్ అర్క్యురీ