Ukraine Crisis: రష్యా దాడులతో కల్లోలంగా మారిన ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులు కోవడం లేదు. ముఖ్యంగా భారత పౌరులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటి ఇతర దేశాల సరిహద్దులకు చేరుకోవాలని భారత ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం భారత జాతీయ జెండాలను పట్టుకోవాలని పౌరులకు సూచించింది. ఈ ఉపాయాన్ని అందిపుచ్చుకుని కొందరు పాకిస్థాన్, టర్కీకి చెందిన విద్యార్థులు కూడా ఉక్రెయిన్ సరిహద్దులను సురక్షితంగా దాటగలిగారు.
ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ గంగ' పేరుతో కేంద్రం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఇండిగో సంస్థలు ఈ విమానాలు నడుపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక విమానం అందుకునేందుకు ఉక్రెయిన్ పొరుగుదేశమైన రొమేనియాలోని బుచారెస్ట్‌కు కొందరు భారత విద్యార్థులు చేరుకున్నారు. భారత జెండాలను పట్టుకోవాలన్న భారత ప్రభుత్వ సూచనను వారు పాటించారు.