డెల్టా వేరియంట్ కారణంగా..కొవిడ్-19 బారినపడి కోలుకున్న వారిలోనూ రెండోసారి వైరస్ సోకే(Corona virus) ప్రమాదం అధికంగా ఉందని బ్రిటన్ ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డెల్టా ముప్పుపై పరిశోధన కొనసాగుతోందని పేర్కొన్నారు. దేశంలో అన్ని వేరియంట్లపై వారం రోజులకోసారి పరిశీలన చేస్తోంది ఇంగ్లాండ్కు చెందిన ప్రజారోగ్య శాఖ(పీహెచ్ఈ). గత వారంలో 33,716 డెల్టా కేసులు పెరిగాయని, దాంతో దేశంలో మొత్తం డెల్టా కేసుల సంఖ్య 2,86,765 చేరినట్లు తెలిపింది. అలాగే.. ఏప్రిల్-జూన్ మధ్యలో నమోదైన 68,688 డెల్టా కేసుల్లో 897 మందికి రెండోసారి వైరస్ సోకినట్లు వివరించింది.
"ఆల్ఫాతో పోలిస్తే డెల్టాతో రెండోసారి వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ. దానిని త్వరగా గుర్తించేందుకు మా విధానాలను ఆధునికీకరించాం. జాతీయ నిఘా విశ్లేషణలో వయసు, టీకా పంపిణీ వంటి వాటిని చేర్చాం. వైరస్ రీఇన్ఫెక్షన్ ముప్పును డెల్టా రకం పెంచుతోందని గుర్తించాం. దీనిపై మరింత పరిశోధనలు కొనసాగిస్తున్నాం."
- ఇంగ్లాండ్ ప్రజారోగ్య విభాగం.