బ్రిటన్‌లో కరోనా వ్యాప్తి మరోమారు ఆందోళనకరంగా మారింది. కరోనా విజృంభణకు చిహ్నంగా.. వైరస్ అలర్ట్ వ్యవస్థను మూడు నుంచి నాలుగుకు పెంచింది అక్కడి ప్రభుత్వం. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని దీని అర్థం.
ఈ నేపథ్యంలో పలు నూతన ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. గురువారం నుంచి ఆసుపత్రి రంగంలో కీలక నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బార్లు, పబ్స్, రెస్టారెంట్లను రాత్రి 10గంటలకే మూసివేయాలని ఆదేశాలిచ్చింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ కొత్త నిబంధనలను మంగళవారం ప్రవేశపెట్టనున్నారు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్.
పెరుగుతున్న కేసులపై ఇంగ్లాండ్, స్కాట్‌ల్యాండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్ ప్రాంతాలకు చెందిన సీఎమ్ఓలు(చీఫ్ మెడికల్ ఆఫీసర్స్) ఓ ప్రకటనను విడుదల చేశారు.
"దేశంలో కరోనా కేసులు, మరణాలు కొంతకాలం తగ్గిన అనంతరం.. మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే అలర్ట్ లెవల్‌ను 3 నుంచి నాలుగుకు పెంచమని సంయుక్త బయో సెక్యూరిటీ సెంటర్ సిఫార్సు చేసింది. నేషనల్ హెల్త్ సర్వీస్‌కు బాధితుల తాకిడితో పాటు భారీ స్థాయిలో మృతుల సంఖ్యను నివారించాలంటే.. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలి. మాస్కులు ధరించాలి. ఇది ప్రజలకు ఆందోళనకరమైన వార్తే అయినప్పటికీ.. నిబంధనలను పాటించాల్సిందే."