బ్రిటన్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ సైకిల్ రైడింగ్ చర్చనీయాంశంగా మారింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి సెంట్రల్ లండన్‌లోని తన ఇంటి నుంచి 11కిలోమీటర్ల మేర సైకిల్‌పై వెళ్లటం విమర్శలకు తావిచ్చింది. అయితే ప్రధాని నిబంధనలను ఉల్లంఘించలేదని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ఆయన తన పరిధిలోనే వ్యాయామం చేసేందుకు సైకిల్‌పై వెళ్లారని చెప్పుకొచ్చారు. ఓ సీనియర్ పోలీస్ అధికారి సైతం జాన్సన్‌కు మద్దతుగా నిలిచారు.
స్కాట్లాండ్ యార్డ్ కమిషనర్ డేమ్ క్రెస్సిడా డిక్ సైతం.. ప్రధాని చర్యను సమర్థించారు. అయితే 'స్టే లోకల్' అనే విధానానికి సరైన అర్థం ప్రభుత్వం తెలపాలని, దీనివల్ల అధికారులు, ప్రజల్లో ఉన్న గందరగోళం తొలగిపోతుందని ప్రభుత్వానికి విన్నవించారు. ప్రజలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు క్రెస్సిడా. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామన్నారు.