క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో బ్రిటన్లో లాక్డౌన్ ఆంక్షలను సడలించనున్నారు. డిసెంబర్ 23 నుంచి 27 మధ్య ప్రజలు.. కలిసి పండగ జరుపుకోవచ్చని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఒక కుటుంబం మరో రెండు కుటుంబాలతో కలిసి 'క్రిస్మస్ బబుల్' వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. బ్రిటన్లోని నాలుగు దేశాలు ఇందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.
ఈ నిర్ణయం వల్ల మూడు కుటుంబాలు కలిసి పండగ నిర్వహించుకునేందుకు యూకేలోని నాలుగు దేశాల్లో(ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్) ఏ దేశానికైనా ప్రయాణాలు చేసుకొనే అవకాశం లభించనుంది. చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలు దర్శించుకునే వీలు ఉంటుంది. నాలుగు రోజుల పాటు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.
జాగ్రత్త!
అయితే క్రిస్మస్ జరుపుకొనే సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బోరిస్ అభ్యర్థించారు. ఇది సాధారణ క్రిస్మస్ కాదని.. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వెసులుబాటును జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు.