UK Covid Restrictions: బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓవైపు ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికిస్తుంటే.. యూకేలో కొవిడ్ ఆంక్షలను మొత్తం ఎత్తివేసినట్లు ప్రకటించారు ప్రధాని బోరిస్ జాన్సన్. ఇంగ్లాండ్లో మాస్క్ తప్పనిసరి నిబంధన సహా ఇతర కొవిడ్ ఆంక్షలన్నింటికీ ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. గరిష్ఠస్థాయికి చేరి, తగ్గుముఖం పట్టినట్లు శాస్త్రవేత్తలు చెప్పారని బోరిస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కూడా ఉండదని పేర్కొన్నారు.
''ఒమిక్రాన్ పీక్ దశను అధిగమించిందని దేశ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటినుంచి.. వర్క్ ఫ్రం హోం చేయాలని ప్రభుత్వం ప్రజలను కోరదు. ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ను మొట్టమొదట అందించింది యూకేనే.''
- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధానమంత్రి
గత వేసవిలో చాలా మంది వ్యతిరేకించినా దేశంలో కఠిన ఆంక్షలు విధించినట్లు గుర్తుచేసుకున్నారు బోరిస్. ఇప్పుడు ఇతర దేశాల్లో లాక్‌డౌన్ ఉన్నా.. తాము అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని అన్నారు. అందుకే జీ-7 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్ అవతరించిందని పేర్కొన్నారు.
బూస్టర్ డోసుల పంపిణీ వేగవంతం చేయడం కారణంగానే.. ఒమిక్రాన్ నుంచి బయటపడిన తొలి దేశం తమదేనని అన్నారు యూకే ప్రధాని.
'' ప్లాన్ బీ నిబంధనల పట్ల ప్రజల ప్రతిస్పందనను బట్టి.. ఇప్పుడు ప్లాన్ ఏకు తిరిగి వచ్చాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, 1918లో సంభవించిన మహమ్మారి తర్వాత ఇదే మాకు అతి పెద్ద సవాలు. ఇలాంటి సమయంలో ఏ ప్రభుత్వమైనా కొన్ని తప్పులు చేస్తుంటుంది.''