Russia Ukraine: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఫాక్స్ న్యూస్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులు దుర్మరణం చెందారు. ఆ ప్రాంతంలో కవరేజ్ కోసం వెళ్లిన వారి వాహనంపై బాండు దాడి జరిగి మంటల్లో చిక్కుకోవడం వల్ల ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వీరి పేర్లు పీర్రె జక్జెవ్స్కీ(వీడియోగ్రాఫర్), ఒలెక్ సాండ్రా(24). క్షేత్రస్థాయి పరిస్థితుల్ని టీవీ ద్వారా ప్రజలకు చూపేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టిన వీరి మృతికి ఫాక్స్ న్యూస్ సీఈఓ సుజానే స్కాట్ సంతాపం తెలిపారు. వీరిద్దరు రిపోర్టర్ బెంజమిన్ హిల్తో పాటు వెళ్తుండగా సోమవారం ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.
ఆదివారం నాడు రష్యా బలగాలు జరిపిన దాడుల్లో డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ బ్రెంట్ రినాడ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. కీవ్ బయట ఇర్పిన్లో ఈ ఘటన జరిగింది. రష్యా దళాలు ఆయన వాహనంపై తూటాల వర్షం కురిపించాయి. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంపై వార్తా సంస్థల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది.
Russia Ukraine conflict
ఆస్పత్రిలో 500 మంది నిర్బంధం..
ఉక్రెయిన్‌పై భీకర దాడులు కొనసాగిస్తున్న రష్యా దళాలు మరియుపోల్‌లో ఓ ఆస్పత్రిని స్వాధీనం చేసుకున్నాయి. అంతేగాక 500 మందిని అందులో నిర్బంధించినట్లు ఉక్రెయిన్ ప్రాంతీయ నాయకుడు పావ్లో కిరిలెంకో తెలిపారు. 400 మంది చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పౌరులను ఇళ్ల నుంచి రష్యా బలగాలు వాహనాల్లో ఆస్పత్రి భవనానికి తీసుకెళ్లాయని, 100 మంది వైద్యులు, రోగులను కూడా దిగ్భంధంలో ఉంచినట్లు చెప్పారు. నిర్బంధించిన వారిని మానవ కవచాలుగా రష్యా దళాలు ఉపయోగించుకుంటున్నాయని, ఎవరినీ బయటకు రానివ్వడం లేదని పేర్కొన్నారు.
20వేల మంది
కీవ్ నగరాన్ని రష్యా బలగాలు ముట్టడిస్తున్న తరుణంలో ప్రజలు ప్రాణభయంతో దేశం వీడి పారిపోతున్నారు. మంగళవారం 20,000 మంది పౌరులు మరియుపోల్ నుంచి మానవతా కారిడార్ ద్వారా తరలిపోయారు. రష్యా దళాలు కీవ్‌పై బాంబులతో విరుచుకుపడుతుండటం చూసి వెళ్లిపోతున్నారు.
US Congress Putin
పుతిన్‌పై తీర్మానం..
ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగి భీకర దాడులకు కారణమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విచారణ జరపాలనే తీర్మానానికి అమెరికా సెనేట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌లో హింసకు పుతినే కారణమని, ఆయన సూచనల మేరకే ఆ దేశ సైన్యం దాడులు చేస్తోందని తీర్మానం పేర్కొంది.
అమెరికా కాంగ్రెస్‌లో జెలెన్స్కీ ప్రసంగం..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ బుధవారం అమెరికా కాంగ్రెస్‌లో వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. రష్యా తమదేశంపై దాడులు చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మద్దతు కోసం విజ్ఞప్తి చేయనున్నారు.