బ్రిటన్ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ కళ్లు చెదిరే విజయం సాధించినందున మూడేళ్లుగా నలుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు స్పష్టమయ్యాయి. బోరిస్ గెలుపు ఐరోపా సమాఖ్య (ఈయూ)నుంచి బ్రిటన్ నిష్క్రమణను దాదాపుగా ఖరారు చేసింది. విపక్ష లేబర్ పార్టీ కంచుకోటలను బద్దలు కొట్టింది. ‘బ్రెగ్జిట్‌ను సాకారం చేద్దాం’ అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బోరిస్ జాన్సన్ తన వాదనను గట్టిగా వినిపించడంలో కృతకృత్యులయ్యారు.
2016లో ‘బ్రెగ్జిట్’పై నిర్వహించిన రెఫరెండంలో మెజారిటీ ప్రజలు నిష్క్రమణవైపే మొగ్గుచూపారు. కానీ గడచిన మూడేళ్లకాలంలో ‘నిష్క్రమణ’ విషయంలో పార్టీల దోబూచులాటలతో విసిగిపోయిన బ్రిటన్ ప్రజలకు బోరిస్ జాన్సన్ నిర్దిష్ట హామీ ఇవ్వగలిగారు. జనవరి ముగిసేలోపు ఈయూనుంచి బ్రిటన్ నిష్క్రమణ ఖాయమంటూ బోరిస్ ఇచ్చిన హామీ ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. దానితోపాటు దేశంలో 14 బహుళ ప్రత్యేకతలున్న వైద్యశాలల ఏర్పాటు; 20వేలమంది పోలీసుల, 50వేల నర్సుల నియామకం చేపడతానని; జాతీయ ఆరోగ్య పథకానికి ధారాళంగా ధన సాయం చేసి జవసత్వాలు కల్పిస్తానని ఆయన వాగ్దానాలు చేశారు. అయితే బోరిస్ ఇచ్చిన హామీలన్నింటిలోకి ‘బ్రెగ్జిట్’ నిజం చేద్దామన్న మాటే జనాన్ని ఆకట్టుకుంది. 650 సభ్యులున్న బ్రిటన్ దిగువ సభలో కన్జర్వేటివ్ పార్టీకి ఇప్పుడు బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది.
పరాజయం మూటగట్టుకొంది
అతివాద వామపక్ష భావజాలం ఉన్న జెరిమి కోర్బెన్ సారథ్యంలో లేబర్ పార్టీ మునుపెన్నడూ కనీవినీ ఎరుగని పరాజయం మూటగట్టుకొంది. బ్రిటన్‌లో గడచిన యాభయ్యేళ్లలో కోర్బెన్ స్థాయిలో అప్రతిష్ఠ పాలైన లేబర్ పార్టీ నాయకుడు మరొకరుండరు. ఇరవై ఒకటో శతాబ్దంలోనూ స్వేచ్ఛా వాణిజ్య విధానాలను తూర్పారపడుతూ, ప్రైవేటు పరిశ్రమలను జాతీయకరిస్తామని హుంకరిస్తూ, అమెరికా వ్యతిరేక- రష్యా సానుకూల విధానాలను అందిపుచ్చుకొని కోర్బెన్ వ్యవహరించిన తీరు బ్రిటన్ ప్రజలకు సుతరామూ నచ్చలేదు. ప్రపంచం ఎన్నో అడుగులు ముందుకు వేసినా- కోర్బెన్ మాత్రం ఇప్పటికీ ప్రచ్ఛన్న యుద్ధంనాటి భావజాలాల మధ్యే బందీ అయ్యారన్న విషయం ఓటర్లకు స్పష్టంగా అర్థమైంది. అందుకే గతంతో పోలిస్తే 59 స్థానాలు కోల్పోయి లేబర్ పార్టీ ఈసారి 203 సీట్లు మాత్రమే సాధించగలిగింది.
లేబర్ పార్టీ మద్దతుదారులు ఎంతోమంది ‘బ్రెగ్జిట్’కు సానుకూలంగా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ‘బ్రెగ్జిట్’పై కోర్బెన్ విధానం ఆ పార్టీ మద్దతుదారులను గందరగోళంలో పడేసింది. ఈయూలో భాగస్వామిగా చేరింది మొదలు ఒకనాటి సోవియట్ దేశాలనుంచి తామరతంపరగా కార్మికులు బ్రిటన్‌లోకి పోటెత్తుతున్నారు. దానివల్ల బ్రిటన్‌కు చెందిన శ్వేతజాతి కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతోంది. కాబట్టే వారు ‘బ్రెగ్జిట్’కు మద్దతుగా మోహరించారు. ఈ పరిస్థితుల్లో కోర్బెన్ సరళి బ్రిటన్ శ్వేత జాతి కార్మికులకు ఏ రకంగానూ మింగుడుపడలేదు. అందుకే గడచిన యాభయ్యేళ్లలో ఏనాడూ గెలవని సీట్లలోనూ ‘టోరీలు’ (కన్జర్వేటివ్ పార్టీకి చెందినవారు) జయకేతనం ఎగరవేశారు.
మట్టిగరిచింది