మాస్కోలో విపక్షాల భారీ ప్రదర్శన రష్యాలో ప్రతిపక్ష నేతలను నిర్బంధించడాన్ని నిరసిస్తూ వారి మద్దతుదార్లు మాస్కోలో శనివారం భారీ ర్యాలీని నిర్వహించారు. వ్లాదిమర్ పుతిన్ అధికారాన్ని చేపట్టాక అతి పెద్ద నిరసన ప్రదర్శన ఇదే... ఈ ప్రదర్శనకు అధికారులూ అనుమతి ఇచ్చారు. స్వేచ్ఛాయుత, న్యాయబద్దమైన ఎన్నికలను జరపాలనే నినాదాలతో నిరసనలు జరిగాయి. ప్రదర్శనలో వేలాది మంది ప్రజలు పాల్లొన్నారు. వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకొని మరీ నిరసనలు చేపట్టారు. అధికారుల అంచనాలకు మించి.. దాదాపు 50వేల మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
2 వేల మందికి పైగా అరెస్టు...
నెల రోజుల్లో మాస్కోలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత కాలంగా తీవ్ర నిరసనల హోరు వినిపిస్తోంది. అందులో భాగంగా జరిగిన రెండు ర్యాలీలకు హాజరైన 2 వేల మందికిపైగా నిరసనకారులను పోలీసులు నిర్బంధించారు. 12 మందిపై నేరపూరిత కేసులు కూడా నమోదు చేశారు. వారిలో రాజకీయ నాయకులతో పాటు విద్యార్థులూ ఉన్నారు.
కొంత మంది యువత.. నిర్బంధానికి గురైన వారి ఫొటోలను టీ షర్టులపై ధరించి నిరసనలు చేపట్టారు. అధికారం చేపట్టి మూడో దశాబ్దంలోకి అడుగుపెట్టిన పుతిన్‌పై.. ప్రస్తుతం ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని తెలిపారు. మాస్కో నిరసనకారులకు మద్దతుగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అనధికారికంగా ర్యాలీ నిర్వహించిన 70 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి:రష్యాలో క్షిపణి పరీక్ష విఫలం.. ఐదుగురు మృతి!