ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80లక్షల మందిపైగా కరోనా బారిన పడగా, 4లక్షలకు పైగా మంది మరణించారు. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు వైద్యులు, పరిశోధకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ను కనుగోనేందుకు వివిధ దేశాలు ఎప్పుడో పరిశోధనలు మొదలు పెట్టాయి. అయితే కరోనా కోరల్లో చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్న వారి ప్రాణాలను కాపాడుతోంది ఓ ఔషధం. అదే డెక్సమెథసోన్.
అతి తక్కువ స్థాయిలో డెక్సమెథసోన్ స్టెరాయిడ్‌ను వాడటం వల్ల మృత్యువుకు దగ్గరైన కరోనా బాధితులు తిరిగి కోలుకున్నట్లు గుర్తించినట్టు బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. కరోనా తీవ్రరూపం దాల్చి వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్న బాధితులకు డెక్సమెథసోన్ ఇవ్వగా.. బాగా పనిచేసిందని, వారు తిరిగి కోలుకున్నట్లు ట్రయల్స్‌లో గుర్తించామన్నారు. అలా యూకేలో ఇప్పటివరకు 5వేలమందిని కాపాడారు. పైగా ఈ ఔషధం అతి తక్కువ ధరకు లభిస్తుండటం విశేషం.
"కొవిడ్-19తో బాధపడుతూ వెంటిలేటర్‌పై ఉన్నవారికి డెక్సమెథసోన్ ఆక్సిజన్‌లా పనిచేస్తోంది. అది వారి జీవితాలను కాపాడుతోంది. పైగా అతి తక్కువ ధరకే లభించడం విశేషం"
-ప్రొఫెసర్ మార్టిన్ లాండ్రే, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
'ఈ జనరిక్ స్టెరాయిడ్ డ్రగ్ వ్యాధి తీవ్రతను తగ్గిస్తున్నట్లు ట్రయల్స్‌లో గుర్తించాం. ఇది చక్కగా పనిచేస్తోంద'ని మరో పరిశోధకుడు పీటర్ హార్బీ తెలిపారు.