చందమామ రావే.. జాబిల్లి రావే.. అంటూ చిన్నప్పుడు అమ్మ పాటలు పాడుతూ... చంద్రుడిని పిలిచేది. చంద్రుడు భూమ్మీదికి రాకపోయినా... మనిషే ఆ జాబిల్లిపైకి వెళ్లి ఈ ఏడాదికి 50 ఏళ్లు నిండుతుంది. 1969 జులై 20న మానవుడు తొలిసారి చంద్రుడిపై కాలు మోపాడు. ఈ సందర్భంగా స్పేస్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది ఇటలీ అంతరిక్ష పరిశోధనా సంస్థ.
మానవుడికి అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు ఈ ఖగోళంలో సంచరిస్తున్నాయి. వాటిని ఛేదించడానికి మనిషి ఎన్నో సాహస యాత్రలు చేశాడు.. చేస్తున్నాడు. వీటికి సంబంధించిన కొన్ని స్మృతులను ఇటలీ అంతరిక్ష పరిశోధనా సంస్థ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి ప్రదర్శిస్తోంది. ఎక్స్ప్లోర్ ఆన్ ది మూన్ అండ్ బియాండ్ (చంద్రుడి అవతల అన్వేషణ) పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
అంతరిక్ష అన్వేషణలో జీవితాలను అంకితమిచ్చిన కొంత మంది గొప్ప వారి గురించి తెలుసుకునే అవకాశం కల్పించిందీ ఎగ్జిబిషన్. యూరి గగారిన్(అంతరిక్ష యానం చేసిన తొలి మానవుడు 1961), నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్(చంద్రుడిపై కాలు మోపిన తొలి మానవుడు1969), వాలంటీనా టెరిష్కోవా(అంతరిక్షయానం చేసిన తొలి మహిళ 1963) లాంటి వ్యక్తుల గురించి సమాచారం అందించనుంది. ఇప్పటి వరకు జరిగిన అంతరిక్ష ప్రయోగాలకు ఈ ప్రదర్శన ద్వారా నివాళి అర్పించనున్నారు.
"రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే ఏం కనిపించట్లేదు. దీనికి కారణం కాంతి కాలుష్యం. విద్యుత్ సదుపాయం లేని కాలంలో ఆకాశం వైపు చూస్తే ఆశ్చర్యం కలిగేది. అసలు పైన ఎవరున్నారు? ఏం జరుగుతుంది?.. ఇవి కొన్ని వేల సంవత్సారల నుంచి వెంటాడుతున్న చిక్కువీడని ప్రశ్నలు. భవిష్యత్తులో దీనికి సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాం"
--మాక్రో కెట్టానియో, నేషనల్ జియోగ్రఫిక్ ఇటాలియా క్యూరేటర్
ఈ ఎగ్జిబిషన్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2016లో అంగారకుడిపై పంపిన ల్యాండర్ నమూనా, ఇటలీకి చెందిన ఉపగ్రహాలు లాంటి అంతరిక్ష వాహనాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది జులై 21వరకు ఈ ప్రదర్శన ఉంటుంది.