Russia vs Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం చల్లారే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో మోహరించిన తమ దళాల్లో కొన్నింటిని వెనక్కి పిలుస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఆ సైనికులంతా తమ స్థావరాలకు వెనుదిరుగుతున్నారని తెలిపింది.
Russia military returning
ఉక్రెయిన్ సంక్షోభానికి కారణమైన భద్రతా పరమైన అంశాలపై తాము చర్చలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే.. విన్యాసాల్లో పాల్గొన్న కొన్ని యూనిట్ల సైన్యం తిరిగి తమ స్థావరాలకు పయనమైందని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.
ఉక్రెయిన్పై రష్యా దండెత్తనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 16న రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా, బ్రిటన్లు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో జర్మనీ వంటి దేశాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి. అయితే, సమస్య పరిష్కారమయ్యే దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో రష్యా చేసిన తాజా ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్ణయంతో యుద్ధం నివారించే అవకాశాలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రపంచానికి సందేశం ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.