తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆయిల్ కొనుగోళ్లు బంద్.. అత్యధిక ఆంక్షలు రష్యాపైనే

Sanctions on Russia: రష్యాపై ఆంక్షలు తీవ్రమవుతున్నాయి. ప్రపంచదేశాల్లో అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో రష్యా తొలి స్థానానికి చేరింది. తాజాగా షెల్ సంస్థ.. ఆ దేశంపై ఆంక్షలు విధించింది. ఆయిల్, సహజ వాయువు కొనుగోళ్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు, రష్యాను స్విఫ్ట్ నుంచి నిషేధించిన నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతిపై భారత్ దృష్టిసారించింది.

russia ukraine war sanctions
russia ukraine war sanctions

By

Published : Mar 8, 2022, 5:56 PM IST

Updated : Mar 8, 2022, 10:57 PM IST

Sanctions on Russia: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ప్రధాన సంస్థలు సైతం అదే దారిలో నడుస్తున్నాయి. తాజాగా ఇంధన రంగంలో అగ్రగామిగా ఉన్న బ్రిటన్ ప్రభుత్వ రంగ సంస్థ 'షెల్'.. కీలక ప్రకటన చేసింది. రష్యా నుంచి ఆయిల్, సహజ వాయువు కొనుగోళ్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సర్వీస్ స్టేషన్​లు, విమాన ఇంధన కార్యకలాపాలు సహా ఇతర ఆపరేషన్స్ అన్నింటినీ నిలిపివేస్తామని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకుంది. దశలవారీగా దీన్ని అమలు చేస్తామని తెలిపింది.

Russia Ukraine war updates

రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను కొనసాగిస్తున్న షెల్ సంస్థను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఇటీవలే విమర్శించారు. రష్యాతో ఇంకా వాణిజ్యం చేస్తుండటాన్ని ప్రశ్నించారు. 'రష్యా చమురులో ఉక్రెయిన్ ప్రజల రక్తం వాసన రావడం లేదా?' అని నిలదీశారు.

ఈ నేపథ్యంలోనే సంస్థ తాజా నిర్ణయం తీసుకుంది. గతవారం రష్యా ముడి చమురును కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయం సరైనది కాదని షెల్ సీఈఓ బెన్ వాన్ బ్యుర్డెన్ పేర్కొన్నారు. ఇందుకు క్షమాపణలు చెప్పారు.

దిగుమతులను నిషేధించాలని అమెరికా...

మరోవైపు, రష్యా నుంచి గ్యాస్‌, ముడి చమురు దిగుమతులపై అమెరికా నిషేధం విధించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికారికంగా ప్రకటించారు. ఈయూ మిత్ర దేశాలు ఈ విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవని, మిత్ర దేశాల పరిస్థితులను తాము అర్ధం చేసుకోగలమని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటూ నిధులు అందిస్తామని బైడెన్‌ స్పష్టం చేశారు. ఆర్థిక, భద్రత, మానవతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బైడెన్‌ తెలిపారు. చమురు దిగుమతులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు.

10 రోజుల్లో 2,700లకు పైగా ఆంక్షలు

Most sanctioned Nation: కాగా, రష్యాపై కేవలం 10 రోజుల వ్యవధిలోనే అనేక దేశాలు 2,700లకు పైగా ఆంక్షలు విధించాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌, ఉత్తరకొరియా వంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలవుతున్నాయని బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది.

'Castellum.ai' అనే ప్రపంచ ఆంక్షల ట్రాకింగ్ డేటాబేస్‌ తాజాగా దేశాలపై ఉన్న ఆంక్షల జాబితాకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇరాన్‌, సిరియా, ఉత్తరకొరియా వంటి దేశాలను దాటి అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా తొలి స్థానంలో ఉంది. ప్రస్తుతం రష్యాపై 5530 ఆంక్షలు ఉండగా.. ఇందులో సగానికి పైగా గత 10 రోజుల్లో విధించనవే. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నాటికి రష్యాపై 2,774 ఆంక్షలు అమల్లో ఉండగా.. ఆ తర్వాత నుంచి మరో 2,778 ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

స్విట్జర్లాండ్ 568 ఆంక్షలు

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. దీంతో రష్యాను అడ్డుకునేందుకు అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు గత కొన్ని రోజులుగా వేల కొద్దీ ఆంక్షలు విధించాయి. ఇందులో అత్యధికంగా స్విట్జర్లాండ్‌ దేశం రష్యాపై 568 ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ఐరోపా సమాఖ్య 518, ఫ్రాన్స్‌ 512, అమెరికా 243 ఆంక్షలు విధించినట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది.

ఇక రష్యా తర్వాత అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న రెండో దేశంగా ఇరాన్‌ ఉంది. ఈ దేశంపై ప్రస్తుతం 3,616 ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ తర్వాత సిరియాపై 2,608, ఉత్తరకొరియాపై 2,077 ఆంక్షలు ఉన్నట్లు నివేదిక తెలిపింది.

ప్రత్యామ్నాయం కోసం భారత్ అన్వేషణ...

స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యా బహిష్కరణకు గురైన నేపథ్యంలో.. చెల్లింపుల కోసం భారత్ ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం అన్వేషిస్తోంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఎగుమతిదారుల కోసం ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆంక్షల వల్ల రత్నాలు, ఆభరణాల వర్తకం విషయంలో నగదు బదిలీకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపాయి.

ద్వైపాక్షిక వాణిజ్యం కోసం బ్రిక్స్ బ్యాంకును ఉపయోగించుకోవడం లేదా భారత్​లోని ప్రభుత్వ రంగ బ్యాంకును నోడల్ బ్యాంకుగా ఎంపిక చేసి.. లావాదేవీలను పర్యవేక్షించేలా చేయడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి:ఉక్రెయిన్​లో బాంబుల మోత.. రష్యా దాడుల్లో 10 మంది మృతి

Last Updated : Mar 8, 2022, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details