తెలంగాణ

telangana

ETV Bharat / international

Russia Ukraine war: రెండో రోజు భీకర పోరు.. చర్చల దిశగా అడుగులు! - ఉక్రెయిన్​పై రష్యా దాడి

Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండోరోజు మరింత భీకరంగా సాగుతోంది. పలు నగరాలు, సైనిక స్థావరాలపై 3 వైపుల నుంచి దాడులు చేసేందుకు పదాతిదళాలు, యుద్ధట్యాంకులను పంపింది. రాజధాని కీవ్‌, రెండో పెద్దనగరం ఖర్కివ్‌ తదితర పట్టణాల్లోకి ప్రవేశించిన పుతిన్‌ సేనలు ఉక్రెయిన్ బలగాలు మధ్య పోరు ఉద్ధృతంగా సాగుతోంది. పుతిన్‌ సేనలను నిలువరించేందుకు ప్రజలకు ఆయుధాలిచ్చిన ఉక్రెయిన్‌ సైన్యం.. అధ్యక్షుడు జెలెన్‌స్కీని బంకర్‌లోకి తరలించింది.

Russia Ukraine war
రష్యా ఉక్రెయిన్​ యుద్ధం

By

Published : Feb 25, 2022, 7:46 PM IST

Russia Ukraine war: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా రెండోరోజు మరింత ఉద్ధృతం చేసింది. మాస్కో సేనలు మూడువైపుల నుంచి ముప్పేటదాడి చేస్తున్నాయి. సైనిక స్థావరాలపై వైమానిక దాడులు జరుపుతున్నాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల నుంచి ప్రవేశించిన పుతిన్‌ సేనలు.. కీలక, వ్యూహాత్మక ప్రాంతాల వైపు కదులుతున్నాయి. కీవ్‌, ఖర్కీవ్‌, ఒడెస్సా, మారియాపోల్‌ తదితర నగరాలతోపాటు నల్ల సముద్రం, నీపర్‌ నదికి అనుసంధానించే ఖెర్సాన్‌ ప్రాంతంపైనా దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ ఆర్థిక కార్యకలాపాలను కట్టడి చేయటానికి ఉపయోగపడుతుందని భావిస్తున్న రష్యా కీలకమైన ఒడెస్సా పోర్టుపై కూడా పట్టు బిగించింది. నివాస ప్రాంతాలకు సమీపంలో బాంబుల మోతలతో హడలిపోతున్న ఉక్రెయిన్‌ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

వెయ్యి మంది సైనికులు మృతి..

మాస్కో బలగాలు రెండో రోజు తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ నగరం నడిబొడ్డుకు చేరుకోవటంతోపాటు రెండో అతిపెద్ద నగరం ఖర్కివ్‌లోకి ప్రవేశించాయి. పుతిన్‌ సేనలు కీవ్‌ నగరంలోకి ప్రవేశించకుండా నది వంతెనలను ధ్వంసం చేసినా ఫలితం లేకపోయింది. కీవ్‌ నగరం వెలుపలే రష్యాసేనలతో పోరాటం జరుగుతున్నట్లు ఉక్రెయిన్‌ బలగాలు పేర్కొన్నాయి. కీవ్‌ శివారు ప్రాంతమైన ఒబోలోస్‌లోకి రష్యా దళాలు ప్రవేశించాయి. ప్రత్యర్థి దాడులను డైమర్, ఇన్‌వాంకీవ్ సైనిక స్థావరాల నుంచి తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ సేనలు తెలిపాయి. కీవ్‌లోని జనావాసాలపై మాస్కో క్షిపణిదాడులను ఉక్రెయిన్‌ వైమానికదళం సమర్థంగా తిప్పికొట్టినట్లు ప్రకటించింది. రష్యాకు చెందిన వెయ్యి మందికిపైగా సైనికులను చంపినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. రష్యాకు చెందిన సుఖోయ్‌-35 యుద్ధవిమానాన్ని కూల్చేసినట్లు తెలిపింది. రోస్టోవ్‌ రీజియన్‌లోని క్రెమ్లిన్ సైనిక స్థావరాన్ని తమ బలగాలు ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. క్షిపణి దాడులతో మాస్కోకు చెందిన పలువిమానాలను కూల్చేసినట్లు పేర్కొంది.

బంకర్​లోకి ఉక్రెయిన్​ అధ్యక్షుడు..

దేశ భూభాగాన్ని రష్యా సేనలు ఆక్రమించకుండా అడ్డుకోవాలన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపు మేరకు అక్కడి సైన్యం ప్రజలకు ఆయుధాలిచ్చింది. పుతిన్‌ సేనలు రాజధాని కీవ్‌ నగరంలోకి ప్రవేశించటం సహా పలు పట్టణాల్లో పోరు భీకరంగా సాగుతుండటంతో అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఉక్రెయిన్ సైన్యం బంకర్‌లోకి తరలించింది. తమ అధ్యక్షుడి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికా అనుమానాలు..

రష్యా సైన్యం కీవ్‌ నగరానికి దూకుడుగా చేరుకోవడంపై అమెరికా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో తమకు అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేయటమే పుతిన్ లక్ష్యంగా కనిపిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించాలన్న కుట్రతోనే క్రెమ్లిన్ దండయాత్రకు దిగందని బ్రిటన్‌ ఆరోపించింది.

118 మిలిటరీ లక్ష్యాల ధ్వంసం

ఉక్రెయిన్‌పై సైనికచర్య ద్వారా మొదటిరోజు అనుకున్న లక్ష్యాలను సాధించినట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌ భూతలంపై ఉన్న 118 మిలిటరీ లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అందులో ఉక్రెయిన్‌కు చెందిన 11 సైనిక వైమానిక స్థావరాలు, 13 కమాండ్‌ పోస్టులు, కమ్యూనికేషన్‌ కేంద్రాలు, 14 ఎస్‌-300, యుద్ధ విమానాలను కూల్చేసే క్షిపణీ వ్యవస్థలు, 36రాడార్‌ కేంద్రాలు, ఐదు యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్‌, ఐదు మానవ రహిత విహంగ వాహనాలు, 18 ట్యాంక్‌లు, ఇతర వాహనాలు ఉన్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. చెర్నోబిల్‌ అణు విద్యుత్తు కేంద్రం ఉన్నప్రాంతాన్ని తమ బలగాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవటంతోపాటు అణు విద్యుత్తు కేంద్రం భద్రత కోసం ప్రత్యేక బెటాలియన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.

చర్చల దిశగా అడుగులు..

ఉక్రెయిన్​పై రష్యా సైనిక దాడిలో పరిస్థితులు చర్చల దిశగా సానుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే.. ఉక్రెయిన్​తో చర్చలకు సిద్ధమని స్పష్టం చేసింది రష్యా. అయితే.. ఉక్రెయిన్ సైన్యం పోరాటం ఆపితేనే తాము సంప్రదింపులు జరుపుతామని తేల్చిచెప్పారు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రొవ్.

చర్చల విషయంపై రష్యా ప్రకటన చేసిన కొద్ది సేపటికే తాము సైతం చర్చలకు సిద్ధమని ప్రకటించింది ఉక్రెయిన్​. నాటో కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండే విషయంలో రష్యాతో చర్చలకు సిద్ధమని తెలిపింది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details