Ruble to USD: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకస్తున్న పశ్చిమ దేశాలు గత కొన్ని రోజులుగా మాస్కోపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి. రష్యా ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూల్చడమే లక్ష్యంగా పాశ్చాత్య దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఆ దేశాల లక్ష్యం నెరవేరుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం రష్యా కరెన్సీ రూబుల్ విలువ భారీగా పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూబుల్ మారకపు విలువ దాదాపు 30 శాతం క్షీణించి 105.27 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక రష్యన్ రూబుల్ విలువ అమెరికన్ సెంట్ కన్నా తక్కువగా ఉంది. శుక్రవారం ఈ విలువ 84గా ఉంది.
Russian ruble value
రూబుల్ పతనం వల్ల రష్యాలో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదివరకు విధించిన ఆంక్షలు కేవలం రష్యాలోని సంపన్న వర్గాల లక్ష్యంగా ఉండగా.. తాజా ఆంక్షల మాత్రం దేశవ్యాప్తంగా అందరిపై ప్రభావం చూపనున్నాయి. దీని వల్ల దేశంలో రాజకీయంగా పుతిన్‌కు తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.
స్విఫ్ట్ నుంచి బహిష్కారం వల్లే..
SWIFT Russia sanctions: చివరి అస్త్రంగా ప్రపంచంలోని 200కుపైగా బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలకు అనుసంధానంగా వ్యవహరించే 'స్విఫ్ట్' సమాచార వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరిస్తూ ఆదివారం అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐరోపా కమిషన్ (ఈసీ).. నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు విధించిన ఆంక్షల్లో ఇదే అత్యంత కఠినమైంది. రూబుల్ పతనం వెనుక ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
రష్యాను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఏకాకిని చేశామని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. జీ7 దేశాలతో పాటు భాగస్వామ్య పక్షాలతో కలిసి పుతిన్‌పై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. పుతిన్ తప్పక ఓటమి చవిచూడాలని అన్నారు.