Olena Zelenska: 'నా శత్రువు మొదటి గురి నేను. ఆ తర్వాత నా కుటుంబం' అని ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. అయినా సరే.. ఆయన కుటుంబం స్వదేశంలోనే ఉండిపోయింది. మా దేశం రండి అంటూ ప్రపంచ దేశాలు ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించింది. శత్రువు పడగవిప్పి బుసకొడుతున్నా సరే.. అక్కడే ఉండేలా ఆయన్ను ప్రేరేపించింది మాత్రం వొలెనా జెలెన్‌స్కా. ఆమె జెలెన్‌స్కీ సతీమణి, ఆ దేశ ప్రధమ మహిళ. జెలెన్‌స్కీ దేశం విడిచిపారిపోయారంటూ గిట్టని వాళ్లు వదంతులు వ్యాప్తి చేసినా.. 'లేదు నా భర్త ఇక్కడే ఉన్నాడు. ఆయన వెంట నేను ఉన్నాను. ఈ ప్రజల వెంట నేనుంటాను' అంటూ ధైర్యంగా చెప్తున్న ఆమె గురించి తెలుసుకుందామా..!
దృఢ వైఖరి..
తన భర్త నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారతానంటే అయిష్టం వ్యక్తం చేసిన జెలెన్‌స్కీ సతీమణి వొలెనా (44).. ఇప్పుడు ప్రతి అడుగులో ఆయన వెంటే నడుస్తున్నారు. శత్రువు కఠినంగా వ్యవహరిస్తున్నా.. దేశం విడిచి వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. తన పిల్లలతో సహా ఇక్కడే ఉండిపోయారామె. 'నాకు భయం లేదు. కన్నీరు రాదు. నేను ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటాను. నా పిల్లలు నా వైపు చూస్తున్నారు. నేను వారి పక్కన ఉండాలి. నా భర్త పక్కన ఉండాలి. అలాగే ఈ దేశ ప్రజల చెంత ఉండాలి' అంటూ పెను ప్రమాదంలో దృఢ వైఖరి ప్రదర్శిస్తున్నారు. జెలెన్‌స్కీ నటుడిగా, దేశాధ్యక్షుడిగా ఎప్పుడూ తెరపైనే ఉన్నారు. ఆమె మాత్రం తెర వెనకే ఉండి, తన పనితాను చేసుకోవడానికి ఇష్టపడేవారు. అయితే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో మాత్రం తన మాటలతో ప్రపంచం దృష్టిలో పడ్డారు.
ఆర్కిటెక్చర్ చదివిన జెలెన్‌స్కా.. తదనంతర కాలంలో రచయితగా తన అభిరుచిని కొనసాగించారు. ఆమె, జెలెన్‌స్కీ చిన్నప్పటి నుంచే కలిసి చదువుకున్నప్పటికీ.. కళాశాల స్థాయిలోనే వీరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం.. 2003లో వివాహానికి దారితీసింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. నటుడిగా కెరీర్‌ను వదిలి, రాజకీయ నాయకుడిగా ప్రస్థానం మొదలు పెడతానని జెలెన్‌స్కీ అనగానే వొలెనా తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే, రాజకీయ నేత నుంచి అధ్యక్షుడిగా ఎదిగే క్రమంలో ఆయన వెంటే ఉండి నడిపించారు.