Ukraine Crisis: ఉక్రెయిన్, రష్యా ఉద్రిక్తతలు.. మరో వలస సంక్షోభానికి దారితీశాయి. రష్యా దూకుడుగా సైనిక చర్యను కొనసాగిస్తుండటంతో.. సుమారు 50 లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకొని, సరిహద్దులు దాటి, పొరుగున ఉన్న ఐరోపా దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఐరాస అనుబంధ సంస్థలు వెల్లడించాయి.
వలసలు ప్రారంభమయ్యాయి. లక్షల్లో ప్రజలు.. మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇప్పటికే రొమేనియా, హంగరీ, పొలండ్, స్లొవేకియాలోకి ప్రవేశించారు. మగవారు మాత్రం యుద్ధంలో సహకరించేందుకు ఉండిపోయారు. దీనికి సంబంధించి యూఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ వివరాలు వెల్లడించింది. 48 గంటలలోపే 50 వేల మందికి పైగా ఉక్రెనియన్లు దేశం విడిచి వెళ్లిపోయారు. చంకలో పిల్లలు, చేతిలో సామాన్లు పట్టుకొని, తమ ఆత్మీయుల్ని ఆలింగనం చేసుకొని, కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, దానికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయి.
రష్యా దళాలు తమ నివాస ప్రాంతాల వద్దకు సమీపించడం, చేతిలో నిత్యావసరాల కొరత ఏర్పడటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఉక్రెనియన్లు దేశం దాటుతున్నారు. వాహనాల వరుసలు బార్లు తీరాయి. పొలండ్‌కు వెళ్లే సరిహద్దు వద్ద ఎముకలు కొరికే చలిలోనే కొన్ని గంటలపాటు ఉండిపోయారు. 'రష్యన్లు దేశం మొత్తాన్ని ఆక్రమిస్తారని మేం భయపడుతున్నాం. మా మగవారిని నిర్బంధిస్తారని ఆందోళనగా ఉంది' అని 44 ఏళ్ల ఎవా మీడియాతో అన్నారు. ఆమె తన ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి హంగరీ చేరుకున్నారు. తన భర్త ఉక్రెయిన్‌లోనే ఉండిపోవడంతో 30 ఏళ్ల లుడ్మిలా పోలండ్‌కు చేరుకున్నారు. ఉక్రెయిన్ మహిళల తండ్రులు, భర్తలు.. అక్కడే ఉండిపోయారంటూ.. ఒంటరిగా మిగిలిన ఆమె కన్నీరు పెట్టుకున్నారు. చేతిలో పసికందుతో 36 గంటల పాటు ప్రయాణించిన మరో మహిళ మాట్లాడుతూ..‘గురువారం ఉదయం పేలుళ్ల శబ్దం విన్నాం. బాంబులు, రాకెట్లు దూసుకువచ్చాయి. మేం ఎక్కడికీ వెళ్లడానికి లేదు’ అని వాపోయారు. ఇలా వెళ్తున్నవారికి గమ్యస్థానం అంటూ ఏమీ లేదన్నారు. కొందరు స్థానిక చర్చిల్లో ఆశ్రయం పొందుతున్నారు. కాగా ఉక్రెయిన్ నుంచి వెళ్తున్నవారికి ఇతరదేశాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో కొందరు తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు.