Russia Ukraine War latest updates: రష్యా భీకర దాడులను ఉక్రెయిన్ సైన్యం సమర్థంగా ఎదుర్కొంటోంది. కీలక నగరాలను స్వాధీనం చేసుకోవాలని యత్నిస్తున్న పుతిన్ సేనలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇప్పటివరకు 13,500 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. 404 ట్యాంకులు, 1279 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 81 విమానాలు, 95 హెలికాప్టర్లు, 9 యూఏవీలను నేలకూల్చినట్లు వివరించింది. వీటికి అదనంగా మూడు నౌకలు, 36 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేశామని తెలిపింది.
curfew in Kyiv
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు నగర మేయర్ విటాలి క్లిష్కో ప్రకటించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ఆంక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. మార్చి 17 ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. బాంబు షెల్టర్లలోకి వెళ్లేందుకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని మేయర్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌కు ముగ్గురు ప్రధానులు..
ఐరోపా సమాఖ్యకు చెందిన కీలక నేతలు ఉక్రెయిన్‌కు బయల్దేరారు. పోలండ్ ప్రధానమంత్రి మేటియస్ మోరెవియకి, ఉప ప్రధాని యరస్లో కాచిన్స్కీ, చెక్ రిపబ్లిక్ ప్రధాని పెటర్ ఫీలా, స్లొవేనియా ప్రధాని యానెస్ జేన్సా.. కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడితో సమావేశం కానున్నారు.
EU leaders Ukraine visit
రష్యా దాడుల నేపథ్యంలో ఈ నేతల ఉక్రెయిన్ పర్యటన చర్చనీయాశంగా మారింది. ఐరోపా సమాఖ్య సమన్వయంతోనే ఈ పర్యటన చేపట్టినట్లు మోరెవియకి పేర్కొన్నారు. ఐరాసకు సైతం పర్యటన గురించి సమాచారం అందించినట్లు చెప్పారు. పర్యటన కొద్దిరోజుల ముందే ఖరారైందని, భద్రతా కారణాల వల్ల రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని మోరెవియకి కార్యాలయం పేర్కొంది. ఉక్రెయిన్‌కు అందించనున్న సహాయం గురించి జెలెన్స్కీతో నేతలు చర్చిస్తారని వివరించారు.
దద్దరిల్లుతున్న కీవ్
కాగా, ఉక్రెయిన్‌లో సోమవారం సాయంత్రం భారీ పేలుళ్లు సంభవించాయి. ఆర్టిలరీ ఆయుధాలతో రష్యా దాడులు చేసిందని అధికారులు తెలిపారు. షెల్లింగుల వల్ల కీవ్‌లోని 51 అంతస్తుల అపార్ట్మెంట్లో భారీగా మంటలు చెలరేగాయని, ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. 'మంటలు చెలరేగగానే అగ్నిమాపక సిబ్బంది.. అపార్ట్మెంట్ వద్ద సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని బయటకు తీసుకొచ్చారు. ఇంకొందరు భవనంలోనే చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం' అని వివరించారు. అటు, ఇర్పిన్, హొస్టోమెల్, బుఖా నగరాల్లోనూ రష్యా దాడులు చేస్తోంది. పోర్ట్ సిటీ అయిన మరియుపోల్‌ను స్వాధీనం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.