తెలంగాణ

telangana

ETV Bharat / international

డ్రైవర్ ​లేకుండానే నడిచే ట్రామ్​ రైలు​! - రోడ్డు

రష్యాలో డ్రైవర్​లేని ట్రామ్​ రైళ్లు నడుస్తున్నాయి. దేశంలో సాంకేతికత వినియోగం వృద్ధి దిశగా డ్రైవర్​ లేని ట్రామ్​ను రూపొందించారు అక్కడి శాస్త్రవేత్తలు. ట్రామ్​ మొదటి దశ పరీక్ష విజయవంతమయింది. కృత్రిమ మేధతో పనిచేయడం, వేగాన్ని నియంత్రించడం సహా, ఏదైనా అడ్డు వస్తే దానంతట అదే బ్రేకులు వేస్తుంది.

డ్రైవర్ ​లేకుండానే నడిచే ట్రామ్​ రైలు​!

By

Published : Aug 12, 2019, 3:12 PM IST

Updated : Sep 26, 2019, 6:19 PM IST

డ్రైవర్ ​లేకుండానే నడిచే ట్రామ్​ రైలు​!

రవాణా రంగంలో సరికొత్త సాంకేతికత అభివృద్ధి దిశగా రష్యా శాస్త్రవేత్తలు చేసిన తొలి దశ ప్రయోగం విజయవంతమైంది. డ్రైవర్‌ లేకుండా స్వతంత్రంగా నడిచే ట్రామ్‌ రైలును రూపొందించారు. కాగ్నిటివ్ టెక్నాలజీస్ అనే సంస్థ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. పరిసరాలను విశ్లేశించుకుంటూ స్వతంత్రంగా, చోదకుడు లేకుండానే ఈ ట్రామ్ రైలు పరుగులు పెడుతుంది. రహదారిపై పరిస్థితులను కెమెరాల సహాయంతో రికార్డు చేస్తూ కంప్యూటర్ల కృత్రిమ మేధతో తానే నిర్ణయాలు తీసుకుంటుంది. రోడ్డుపై ఏదైనా అడ్డువస్తే దానంతట అదే ఆగిపోతుంది. రోడ్డు దాటుతున్న పాదచారులను వెంటనే గుర్తుపడుతుంది. వారిని ఢీకొట్టకుండా ఆగిపోతుంది.

2018 అక్టోబరు నుంచి ఈ సాంకేతికతపై కాగ్నిటివ్ టెక్నాలజీస్ పరీక్షలు జరుపుతోంది. ఉత్తర మాస్కో నగర వీధుల్లో దీనిని ప్రయోగాత్మకంగా నడిపిస్తూ ఫలితాలను సేకరిస్తున్నారు. పరీక్షలలో భాగంగా రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్‌కు స్పందించడం, రోడ్డు-రైలు మార్గాల కలయిక వద్ద వేగాన్ని నియంత్రించడం వంటి సాధారణ, ప్రాథమిక విధులపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. మనుషులు అడ్డువచ్చినప్పుడు వాహనాన్ని ఏ విధంగా నియంత్రిస్తుందో అనే విషయాలపై కాగ్నిటివ్ టెక్నాలజీ పరిశీలిస్తుందని సంస్థ ఆటో పైలట్ డెవలప్‌మెంట్ టీం అధ్యక్షుడు యురీ మిన్‌కిన్‌ తెలిపారు.

తుపానులొస్తే...?

వివిధ వాతావరణ పరిస్థితులను అంచనా వేసి వాటికి ప్రతిస్పందించే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. కొన్ని వాతావరణ పరిస్థితులు కెమెరాల దృష్టిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మాస్కో నగరంలో కొన్నిసార్లు ధూళి తుపానులు సంభవిస్తుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థ పనిచేయకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రకాశవంతమైన సూర్య కిరణాలు కెమెరాలపై పడినప్పుడు అవి పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోతున్నాయని అన్నారు. 'భారీ వర్షాలు కురిసినప్పుడూ పరిసరాలను అంచనా వేయడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సాంకేతికత సక్రమంగా పనిచేయగలగాలి' అని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం 417 కిలోమీటర్ల మేర ఉన్న ఈ ట్రామ్ లైన్ల వ్యవస్థ మాస్కో నగర ప్రయాణికులకు ప్రధాన ప్రయాణ సాధనంగా ఉంది. స్థానిక ప్రభుత్వాలు కూడా నూతన ట్రామ్‌ లైన్ల నిర్మాణం, అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నాయి. ఈ నూతన సాంకేతికత పరిచయంతో రష్యాలో స్వయంచోదక ట్రామ్ రైళ్లు త్వరలోనే పరుగులు పెట్టే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో బక్రీద్​

Last Updated : Sep 26, 2019, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details