వ్యాక్సిన్ తీసుకున్నవారితో పోల్చితే, కొవిడ్ బాధితుల్లోనే రక్తం గడ్డకట్టే ముప్పు ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.. పలువురు కొవిడ్ వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నవారిని, కరోనా బాధితులను రెండు వారాలపాటు పరీక్షిస్తూ వచ్చారు. వీరిలో ఎంతమంది 'మెదడు సిరల్లో రక్తం గడ్డకట్టడం (సీవీటీ)'తో బాధపడుతున్నారన్నది తులనాత్మకంగా విశ్లేషించారు.
కొవిడ్తోనే రక్తం గడ్డకట్టే ముప్పు అధికం! - blood clotting risk more for COVID
కరోనా బాధితుల్లో రక్తం గడ్డకట్టే ముప్పు అధికంగా ఉందని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కంటే వైరస్ బారిన పడ్డవారిలోనే ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్ఫర్డ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో బయటపడింది.
కొవిడ్ బాధితుల్లో సీవీటీ సాధారణంగానే తలెత్తుతోందని, ఇలాంటి వారిలో 30% మంది 30 ఏళ్లలోపు వారే ఉంటున్నారని పరిశోధకులు తేల్చారు. టీకా తీసుకున్న తర్వాత పరిస్థితితో పోల్చితే .. కొవిడ్ కారణంగానే 8-10 రెట్లు అధికంగా సీవీటీ ముప్పు పొంచి ఉందని వారు కనుగొన్నారు. 'కొన్ని కొవిడ్ వ్యాక్సిన్ల కారణంగా మెదడులో రక్తం గడ్డకట్టే ముప్పు ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు వాటి వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. నిజానికి వ్యాక్సిన్ల కంటే కొవిడ్ కారణంగానే సీవీటీ ముప్పు తీవ్రంగా ఉంటోంది. టీకా వల్ల లాభనష్టాలను అంచనా వేసుకునేటప్పుడు దీన్ని గమనంలోకి తీసుకోవాలి. రక్తం గడ్డకట్టడానికి ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్లు, ఒకే తీరులో కారణమవుతున్నాయా? అన్న విషయమై లోతైన అధ్యయనం చేపట్టాల్సి ఉంది' అని పరిశోధనకర్త పాల్ హారిసన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'దేశవాళీ ఆవులపై పరిశోధనలు పెరగాలి'