రాజకుటుంబం నుంచి వేరుపడతామంటూ ప్రకటించిన ప్రిన్స్ హ్యారీని... ముఖాముఖి చర్చలకు రావాలంటూ బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఆదేశించారు. సోమవారం జరిగే ఈ సమావేశంలో.. డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ, ఆయన సోదరుడు డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ విలియం, వారి తండ్రి.. వేల్స్ యువరాజు చార్లెస్ హాజరు కానున్నారు.
రాణి నివాసమైన శాండ్రింగ్‌హామ్‌లో జరిగే ఈ సమావేశంలో... ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఫోన్ ద్వారా చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం మేఘన్.. తన కుమారుడితో కెనడాలో ఉన్నారు. రాచకుటుంబం నుంచి బయటకువస్తున్నట్లు ప్రిన్స్ హ్యరీ దంపతులు ప్రకటించిన తర్వాత జరిగే మొదటి సమావేశం ఇది. కొన్ని రోజుల నుంచి సంప్రదింపులు జరుపుతున్న ప్రస్తుత సమావేశంతో ఈ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం.