తెలంగాణ

telangana

ETV Bharat / international

120 ఏళ్ల సంప్రదాయం.. పోస్ట్​ఉమెన్ పడవ ప్రయాణం - జర్మనీ

జర్మనీలోని ఓ ప్రాంతం. ఆ ప్రాంతమంతా నీట మునిగి ఉంటుంది. అయినా ఎన్నో ఏళ్లుగా అక్కడ తరతరాలుగా ఆవాసాలు ఏర్పరుచుకుని ఎవరింట్లో వారు నివాసం ఉంటున్నారు. అక్కడికి చేరుకోవటానికి రోడ్డు మార్గం లేదు. అయినా ఆ ఊళ్లో తపాలా సేవలు మాత్రం అద్భుతం. ఓ పోస్ట్​ఉమన్ పడవలో ఉత్తరాలు,పార్శిళ్లు పంచుతూ 120 ఏళ్లుగా సాగుతున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

పోస్ట్​ఉమెన్ పడవ ప్రయాణం

By

Published : Jul 3, 2019, 4:05 PM IST

పోస్ట్​ఉమెన్ పడవ ప్రయాణం

రవాణా సౌకర్యం సరిగ్గా లేని జర్మనీ స్ప్రీవాల్డ్​లోని లెహ్డేలో​ తపాలా సేవలు మాత్రం అద్భుతం. పోస్ట్​ఉమన్ ఆండ్రియా బునర్ పడవలో ఉత్తరాలు,పార్శిళ్లు పంచుతూ 120 ఏళ్లుగా సాగుతున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. లుబెనావూ నుంచి లెహ్డేకు స్వయంగా తానే తెడ్డుతో పడవ నడుపుతూ లెహ్డేలో ఉత్తరాలు, పార్శిళ్లు పంచుతారామె. పచ్చని చెట్ల నడుమ పారే కాలువలో దర్జాగా సాగుతుంది ఆమె ప్రయాణం.

"పోస్ట్ డబ్బాలు నిండిన పడవలో సాగే నా ప్రయాణం దాదాపు 8 కి.మీ ఉంటుంది.దారిలో 65 ఇళ్లకు ఉత్తరాలు అందించాలి. ఇందుకు నాకు 2 గంటల సమయం పడుతుంది."
- ఆండ్రియా బునర్, పోస్ట్ ఉమెన్.

ఆ ప్రాంతంలో ఇప్పటికీ రోడ్డు మార్గం లేదు. 122 ఏళ్ల క్రితం ఉత్తరాలు రావాలంటే ఆదివారం చర్చికి వెళ్లి తెచ్చుకునేవారు. 1897లో ఈ సమస్యకు పరిష్కారంగా అక్కడి పోస్ట్​ శాఖ పడవలో ఉత్తరాలు పంపాలని నిర్ణయించింది. ఇప్పుడు ఆ బాధ్యత ఆండ్రియా నిర్వహిస్తున్నారు. అక్కడి ప్రజల అవసరాల మేరకు ఆమె కొన్ని నిత్యావసర వస్తువులూ విక్రయిస్తారు. వారానికి ఆరు వందల ఉత్తరాలు, 31 కిలోలున్న 70 డబ్బాలను ఆమె పడవ ద్వారా గమ్యం చేరుస్తారు.

"పోస్ట్ బ్యార్జ్​కి 122 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది స్ప్రీవాల్డ్​లో ఉంటుంది. అప్పట్లో ప్రజలు పడవలపైనే ఆధారపడి జీవించేవారు. ఇప్పటికీ ఎంతో మంది ఇంటికి చేరడానికి పడవలను వినియోగిస్తున్నారు. ఇదే సులభమైన, వేగమైన మార్గం"
-ఆండ్రియా బునర్,పోస్ట్ ఉమెన్.

కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులను తట్టుకుని పడవలో రోజూ ప్రయాణించడం సాధారణ విషయమేమీ కాదు. అల్యూమినియంతో తయారైన తేలికపాటి పడవలో ఆండ్రియా పయనిస్తుంటారు. గడ్డకట్టించే మంచునూ ఎదుర్కొని ఆమె కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు.

"ఉత్తరాలను మోసే ఈ పడవ అల్యూమినియంతో తయారైంది. ఎంతో తేలికగా ఉంటుంది. వడగండ్ల వాన, ఈదురుగాలులు, మంచు కురిసినప్పుడు పడవ నడపడం కష్టమౌతుంది. అలాంటి సమయాల్లో పడవను అదుపు చేయడం ఒక సవాలు." -ఆండ్రియా బునర్,పోస్ట్ ఉమెన్.

సహజంగా ఇన్ని ఉత్తరాలను రోడ్డు మార్గంలో చేరవేయాలంటే వాహనాల నుంచి 350 కిలోల కార్బన్-​డై-ఆక్సైడ్ వెలువరించాల్సి ఉంటుంది​. అందుకే కాలుష్యాన్ని తగ్గించి, వేగంగా ఆ ఉత్తరాలను చేరవేయడం సంతోషంగా ఉందంటారు ఆండ్రియా.

ఇదీ చూడండి:సూర్యుడ్ని ఎప్పుడైనా ఇలా చూశారా?

ABOUT THE AUTHOR

...view details